Electric shock | రాజంపేట : కుమారుడి పెళ్లి పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తో తండ్రి మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ సంఘటన రాజంపేట మండలం శివాయి పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
రాజంపేట ఎస్సై పుష్ప రాజ్ కథనం ప్రకారం.. శివాయిపల్లి గ్రామానికి చెందిన గజ్జల వెంకటి (57) తన కుమారుడు గజ్జల నరేష్ వివాహం సోమవారం మధ్యాహ్నం జరగనుంది. ఫంక్షన్ కోసం తీసుకొచ్చిన మేకలను కోసేందుకు తెల్లవారుజామున రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ కు తీసుకెళ్లాడు.
అక్కడ ఉన్న మూవింగ్ స్టాండ్‌ను పక్కకు జరుపుతుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న 11 కేవీ వైర్లకు అకస్మాత్తుగా తగిలింది. దీంతో కరంట్ షాక్ తగలడంతో పడిపోయాడు. గమనించిన పలువురు కుటుంబీకులకు సమాచారం అందించగా హుటాహుటిన చికిత్స నిమిత్తం కామారెడ్డి దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడి భార్య గజ్జల నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.