IND vs ENG : బర్మింగ్హమ్లో భారత జట్టు (Team India) చరిత్ర సృష్టించింది. బజ్ బాల్ ఆటతో ప్రత్యర్థుల భరతం పట్టే ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269, 161) విధ్వంసక బ్యాటింగ్‌కు.. ఆకాశ్ దీప్(6-99) అద్భత బౌలింగ్ తోడవ్వగా చరిత్రలో నిలిపోయే విక్టరీ సాధించింది. ఆల్‌రౌండ్ షోతో ఆతథ్య జట్టును వణికించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ బృందంపై 336 పరుగులతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఐదు టెస్టుల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో బోణీ కొట్టింది.
లీడ్స్‌లో అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్‌లో దెబ్బతిన్న సింహంలా గర్జించింది. తొలి రెండు రోజులు.. నాలుగో రోజు ఆధిపత్యం చెలాయించిన భారత్ ఆఖరి రోజు ఇంగ్లండ్‌ను ఓటమి రుచి చూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (269) ద్విశతకంతో చెలరేగి భారీ స్కోర్ అందిస్తే.. సిరాజ్ ఆరు వికెట్లతో బెన్ స్టోక్స్ సేనను దెబ్బకొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ సారథి గిల్ సెంచరీతో విజృంభించగా 161), రవీంద్ర జడేజా(69), రిషభ్ పంత్ (65) బ్యాటింగ్ మెరుపులతో ఆతిథ్య జట్టుకు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిడియా.
India register a stunning 336-run win to square the #ENGvIND Test series 1-1 🙌#WTC27 | 📝: https://t.co/Av3A67xTry pic.twitter.com/dQ1lz1WPFD
— ICC (@ICC) July 6, 2025
భారత్ నిర్దేశించిన కష్టసాధ్యమైన ఛేదనలో ఆకాశ్ దీప్, సిరాజ్ ధాటికి నాలుగో రోజు ఆఖరి సెషన్లో ఇంగ్లండ్ 72కే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. వాన కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైనా ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఓలీ పోప్(24)ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఆకాశ్ దీప్ (4-58) వికెట్ల వేటకు తెరతీశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఊహకందని బంతితో హ్యారీ బ్రూక్(23)ను ఎల్బీగా వెనక్కి పంపి టీమిండియాను గెలుపు వాకిట నిలిపాడు. అయితే.. కెప్టెన్ బెన్ స్టోక్స్(35), జేమీ స్మిత్ (88)లు డిఫెన్స్ ఆడుతూ విసిగించారు. ఈ జోడీని విడదీసేందుకు గిల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు వాషింగ్టన్ సుందర్ బ్రేకిచ్చాడు. లంచ్‌కు ముందు ఓవర్లో స్టోక్స్ ఎల్బీగా ఔటయ్యాడు. అంతే.. భారత శిబిరంలో సంబురాలు మిన్నంటాయి.
భోజన విరామం తర్వాత కూడా స్మిత్ పట్టుదలగా ఆడాడు. క్రిస్ ఓక్స్(7)ను ప్రసిధ్ ఔట్ చేసి.. ఏడో వికెట్ అందించాడు. ఆకాశ్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన స్మిత్.. హ్యాట్రిక్ సిక్సర్ కొట్టే క్రమంలో డీప్ స్క్వేర్ లెగ్‌లో సుందర్ చేతికి చిక్కాడు. అయితే.. బ్రాండన్ కార్సే(38), షోయబ్ బషీర్(12)లు పెద్ద షాట్లు ఆడడంతో చివరి రెండు వికెట్లు తీసేందుకు శ్రమపడాల్సి వచ్చింది. చివరి వికెట్ కూడా ఆకాశ్‌కే దక్కడంతో భారత్ 336 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది.