Hyderabad | వెంగళరావునగర్, జూలై 6 : బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా మామదూర్కు చెందిన వీర్లపల్లి పవన్ (24) నగరంలోని బేగంపేట్‌లో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తూ ఎల్లారెడ్డిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు.
ఆదివారం ఉదయం బాత్రూమ్కు వెళ్లి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో రూమ్ మెట్స్ హాస్టల్ సిబ్బందికి చెప్పారు. బాత్రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కొక్కానికి టవల్‌తో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. అతని సెల్ ఫోన్ పరిశీలించగా బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌ల మెసేజ్ లు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలే ఇతని అప్పులను తండ్రి చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.