సిడ్నీ: ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి అయిదో టెస్టు జరగనున్నది. అయితే ఆ తుది టెస్టుకు.. పేస్ బౌలర్ ఆకాశ్ దీప్(Akash Deep) దూరం కానున్నాడు. గాయం వల్ల అయిదో టెస్టుకు ఆకాశ్ దీప్ అందుబాటులో ఉండడం లేదని కోచ్ గౌతం గంభీర్ తెలిపాడు. వెన్ను పట్టేయడం వల్ల అతన్ని తప్పిస్తున్నట్లు వెల్లడించారు. బ్రిస్బేన్, మెల్బోర్న్ టెస్టుల్లో ఆకాశ్ దీప్.. మొత్తం అయిదు వికెట్లు తీసుకున్నాడు. సిడ్నీలో ఇవాళ జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని తెలిపాడు. అయితే పిచ్‌ను పరిశీలించిన తర్వాత తుది జట్టును వెల్లడిస్తామని గంభీర్ చెప్పాడు.
ఆకాశ్ దీప్ రెండు టెస్టుల్లో మొత్తం 87.5 ఓవర్లు వేశాడు. అయితే అతిగా బౌలింగ్ చేయడం వల్ల అతనికి నొప్పి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా మైదానాలు చాలా హార్డ్‌గా ఉండడం వల్ల మోకాలి, మడిమ, వెన్ను నొప్పులు వస్తుంటాయి. ఆకాశ్ దీప్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి. అయిదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నది.
ఆసీస్ జట్టులో కూడా ఓ మార్పు జరగనున్నది. మిచెల్ మార్ష్‌ను తప్పించారు. పేలవంగా ఆడుతున్న అతన్ని తుది టెస్టుకు దూరం పెట్టేశారు. టాస్మానియా ఆల్‌రౌండర్ బూ వెబ్‌స్టర్.. టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. నాలుగు టెస్టుల్లో మిచెల్ మార్ష్ కేవలం 73 రన్స్ మాత్రమే చేశాడు. 33 ఓవర్లు వేసి మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో అతన్ని తప్పిస్తున్నట్లు కెప్టెన్ కమ్మిన్స్ తెలిపాడు.