Ajinkya Rahane : ఆస్ట్రేలియా పర్యటనలో సారథిగా చిరస్మరణీయ విజయాలు అందించిన అజింక్యా రహానే (Ajinkya Rahane) జట్టుకు దూరమై రెండేళ్లు కావొస్తుంది. అతడు చివరిసారిగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో వైట్ జెర్సీ వేసుకున్నాడు. దేశవాళీ టోర్నీలు, ఐపీఎల్లో అదిరిపోయే బ్యాటింగ్‌తో చెలరేగుతున్న ఈ మాజీ కెప్టెన్ మరోసారి టెస్టుల్లో ఆడాలనుకుంటున్నాడట. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలుతో తనకు అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లను కోరుతున్నాడు రహానే.
ఇంగ్లండ్ పర్యటనతో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్‌గా ఎంపికవ్వడంతో పునరాగమనంపై ఆశలు పెంచుకుంటున్నాడు రహానే. తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు సుదీర్ఘ ఫార్మాట్లో మెరుపులు మెరిపిస్తానంటున్నాడీ 37 ఏళ్ల క్రికెటర్. ఈమధ్యే స్కై స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నాకు టెస్టు క్రికెట్ ఆడాలని ఉంది. ఇప్పటికీ నాకు సుదీర్ఘ ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. అందుకే.. సెలెక్టర్లతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. కానీ, వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. కమ్ బ్యాక్ కోసం చూస్తున్న నాకు తలుపులు మూసేశారు’ అని ఈ ముంబై సారథి వాపోయాడు.
అయితే.. సెలెక్టర్ల నుంచి పిలుపు అందినా, అందకున్నా ఒక క్రికెటర్‌గా తాను ఆటను ఎల్లప్పుడూ ప్రేమిస్తానని అంటున్నాడీ రంజీ హీరో. రెండేళ్ల క్రితం జట్టులో చోటు కోల్పోయిన రహానే ప్రస్తుతం దేశవాళీ సీజన్‌కు సిద్దమవుతున్నాడు. ఓవైపు డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూనే ఐపీఎల్‌లోనూ తన మెరుపు బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడీ వెటరన్. అయితే.. 18వ సీజన్లో రహానే సారథ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)ప్లే ఆఫ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.