మక్తల్ : షార్ట్ సర్క్యూట్ (Short Circuit ) తో దివ్యాంగ బాలిక (Disabled girl) మృతి చెందిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం మక్తల్ పట్టణంలోని నందిని నగర్లో చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ఈసరి బాలకృష్ణ సుజాత దంపతుల కూతురు భానుప్రియ (12) చిన్నప్పటి నుంచి అంగవైకల్యం తో జన్మించడంతో బాలిక ఎక్కడ కదలలేని పరిస్థితిలో ఉండేదని తెలిపారు. ఆదివారం ఇంట్లో బాలిక ఒకటే ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూటయి ఇంట్లో మంటలు వ్యాపించడం వల్ల ఏం జరుగుతుందో తెలియక మంటల్లో కాలి సజీవ దహనమైందని తెలిపారు.
సమయానికి ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలిక మృతి చెందడం పలువురిని కదలింపచేసింది. స్థానికులు మంటలను ఆర్పేందుకు స్థానిక ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినప్పటికీ బాలిక ప్రాణాలతో మిగలలేదని తెలిపారు. తమ కూతురు మంటల్లో కాలి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు.