టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లు ఆడేందుకు గాను అగ్రరాజ్యం అమెరికాకు చేరింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే మూడు టీ20లు కరేబియన్ దీవుల్లో నిర్వహించగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లను ఫ్లోరిడాలో జరిపించనున్నారు. ఈ సిరీస్ ముగిశాక టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్తుంది. ఆ తర్వాత నేరుగా యూఏఈకి వెళ్లి అక్కడ ఆసియా కప్ ఆడనుంది. అదీ ముగిశాక భారత జట్టు స్వదేశంలో బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. రెండు దేశాలతో ఆరు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు గాను రోహిత్ అండ్ కో ఏకంగా 8,800 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది.
ఆసియా కప్ (సెప్టెంబర్ 11) ముగిశాక టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు టీ20లు ఆడుతుంది. సెప్టెంబర్ 20 నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ, నాగ్‌పూర్, హైదరాబాద్‌లలో మూడు టీ20లు జరుగుతాయి. మొహాలీ నుంచి నాగ్‌పూర్‌కు 1,330 కిలోమీటర్లు. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు 500 కి.మీ. 25 సెప్టెంబర్న సిరీస్ ముగుస్తుంది.
ఇక ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిశాక వెంటనే భారత్.. సెప్టెంబర్ 28న దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. తిరువనంతపురం, గువహతి, ఇండోర్లు ఇందుకు వేదికలు. హైదరాబాద్‌లో ఆసీస్‌తో మూడో టీ20 ముగిసిన వెంటనే భారత జట్టు తిరునంతపురం బయల్దేరాల్సి ఉంది. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 1,300 కి.మీ. తిరువనంతపురం నుంచి గువహతికి 2,200 కి.మీ. ఈ రెండు పట్టణాల మధ్య నేరుగా ఫైట్స్ లేవు. అంటే తిరువనంతపురం నుంచి చెన్నై (775 కిలోమీటర్లు) చేరుకుని.. అక్కడ్నుంచి అసోం వెళ్లాల్సి ఉంది. ఇక గువహతి నుంచి ఇండోర్‌కు 2,200 కి.మీ.
ఆరు మ్యాచ్‌ల కోసం భారత జట్టు ఏకంగా 8,800 కి.మీ. ప్రయాణించాల్సి రావడంపై టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సఫారీలతో టీ20, వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. ఈ కీలక టోర్నీ ముందు బిజీ షెడ్యూల్స్, తీరిక లేని ప్రయాణాల వల్ల ఆ ప్రభావం ఆటగాళ్ల మీద పడితే అది మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారు. మానసిక ఆరోగ్యం సంగతి అటుంచితే మెగా టోర్నీ ముందు ఎవరైనా సీనియర్ ఆటగాడు (రోహిత్, కోహ్లీ, కెఎల్ రాహుల్, బుమ్రా, పంత్, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్) గాయపడితే మాత్రం అది టీమిండియాకు కోలుకోలేని దెబ్బే. మరి మెగా ఈవెంట్ ముందు జరిగే టీ20 సిరీస్ లకు భారత జట్టు ఏ మేరకు రాణిస్తుంది..? ఆటగాళ్ల ఫామ్ ఎలా ఉంటుంది..? పొట్టి ప్రపంచకప్ ముందు ఈ సిరీస్‌లు భారత్‌కు మేలు చేస్తాయా..? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది.