Prashanth Neel Presents 418 | ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘418’ (ది లాస్ట్ వార్నింగ్) సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రంతో తొలిసారిగా హారర్ జోనర్లోకి అడుగుపెడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తన్ నడగౌడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
15 ఏళ్లుగా మూతపడిన ఒక రహస్య భవనం మరియు దాని వెనుక ఉన్న ‘రూమ్ నంబర్ 418’ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఏమాత్రం హాస్యానికి తావు లేకుండా, పూర్తిగా భయం, ఉత్కంఠ మరియు సైకలాజికల్ టెన్షన్ ప్రధానంగా ఈ హారర్ థ్రిల్లర్నుఎ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. కంటెంట్ పరంగా తీవ్రత ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఏ’ (A) సర్టిఫికెట్ జారీ చేసింది.
ఈ చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, చైత్ర ఆచార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వెంకీ జీజీ సంగీతం అందించారు. దినేష్ దివాకర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రేక్షకులకు సరికొత్త భయానక అనుభూతిని పంచడానికి సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ థియేటర్లలో సెప్టెంబర్ 18న గ్రాండ్గా విడుదల కానుంది.