అంతుపట్టని ఆర్థిక వృద్ధి లెక్కలు!
కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అద్భుతమైన వృద్ధి రేటు లెక్కలు, వంటింటి పద్దులకు భిన్నంగా ఉన్నాయి. కాగితాల్లో చూపుతున్న అంకెలు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు మధ్య ఈ వ్యత్యాసం ఎందుకు ఉన్నది అనేది ఓ అంతులేని చిక్కుముడిగా మారిపోయింది.
దేశంలో ఆర్థిక వృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, నిత్య జీవితంలో సామాన్యులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు పొంతనలేకుండా పోయింది. ఓ వైపు గడచిన పదేండ్లలో అద్భుత ప్రగతి సాధించామని ప్రభుత్వ నివేదికలు, ఆర్థిక విభాగాలు చెప్తున్నాయి.
అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ముందంజలో ఉన్నదని గొప్పగా చాటుతున్నాయి. సుమారు 7 శాతం వృద్ధి రేటు సాధించామని లెక్కలు చూపుతున్నాయి. మరోవైపు సామాన్య ప్రజానీకపు రోజువారీ జీవనం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తుంటే, పెరుగని వేతనాలు నిరుత్సాహపరుస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అద్భుతమైన వృద్ధి రేటు లెక్కలు, వంటింటి పద్దులకు భిన్నంగా ఉన్నాయి. కాగితాల్లో చూపుతున్న అంకెలు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు మధ్య ఈ వ్యత్యాసం ఎందుకు ఉన్నది అనేది ఓ అంతులేని చిక్కుముడిగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వృద్ధి రేటు లెక్కలు, వాటికి ఆధారంగా నిలుస్తున్న అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే కీలక విషయాలు అర్థమవుతాయి. గడచిన పదేండ్లలో అంతర్జాతీయ పరిణామాలు, కొవిడ్, పశ్చిమాసియాలోని ఘర్షణలు సహా పలు సంక్షోభాలు సంభవించాయి. ఇవి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను పదేపదే దెబ్బతీశాయి. భారతదేశానికి అవసరమైన చమురులో అత్యధిక భాగం దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా సంభవించే ప్రతి సంక్షోభమూ వెంటనే దేశీయంగా దిగుమతి ద్రవ్యోల్బణంగా మారుతున్నది. హఠాత్తుగా ధరలు పెరుగడంతో సామాన్య కుటుంబాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు పూర్తిగా కుదేలవకుండా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇంధన పన్నులను తగ్గించడం, వంటగ్యాస్, ఎరువుల రాయితీలను అందించడం కోసం కేంద్రం, చమురు సంస్థలు రూ.4,21,800 కోట్లు ఖర్చు చేసినట్టు అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంక్ యూబీఎస్ (యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్) అధ్యయనంలో వెల్లడించింది. ఇది మన దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 1.2 శాతానికి సమానం. ఈ చర్యలు స్వల్పకాలంలో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రభుత్వ ఖజానాపై మాత్రం భారీ భారం మోపాయి.
ఇంధనాలపై వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా తగ్గిన సమయంలో ప్రభుత్వ వ్యయం 10 శాతానికి పైగా పెరిగింది. దీంతో ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యలోటు ఏకంగా రూ.7.1 లక్షల కోట్లకు చేరుకున్నది. ప్రభుత్వం ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడగలిగింది. అయితే, అందుకోసం తన సొంత ఆర్థిక భద్రతా నిధులనే కరిగించుకోవాల్సి వచ్చింది. ఈ వ్యత్యాసం క్రమంగా విశ్వసనీయతకు సంబంధించిన ఒక కనిపించని సంక్షోభానికి దారితీస్తున్నది.
ఆర్థిక వృద్ధి రేటుపై ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు వాస్తవమా, లేక ఆర్థిక ఇబ్బందులను కప్పిపుచ్చేందుకు ఉపయోగపడుతున్నాయా అని ఆర్థికవేత్తలు, ఆర్థిక శాఖ మాజీ అధికారులు, బ్యాంకింగ్ రంగంలోని ఉన్నతాధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధి గణాంకాలు గొప్పగా కనిపిస్తున్నాయి. కానీ పరిశ్రమల్లోని స్తబ్ధత, పెద్ద నోట్ల రద్దు, హడావుడిగా చేపట్టిన పన్నుల సంస్కరణలు తీవ్రమైన ప్రతికూల పరిణామాలకు కారణమయ్యాయి. అటువంటి నేపథ్యంలో దెబ్బతిన్న చిన్న, అసంఘటిత వ్యాపార సంస్థలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుని దూసుకుపోతున్నదని ప్రభుత్వం చెప్తున్న సమయంలోనే, ప్రజలు నిత్యావసరాల ఖర్చుల కోసం కూడా వ్యక్తిగత రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి కనిపిస్తున్నది. రుణభారం పెరుగుతుంటే… ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లోనే ఏదో ప్రాథమికమైన లోపం ఉన్నట్టే కదా!
పదేండ్లుగా సామాన్య ప్రజల జీవన వ్యయం నిరంతరం భారంగా మారుతూనే ఉన్నది. ద్రవ్యోల్బణం భరించలేని స్థాయికి మించి పెరుగుతున్నది. అస్తవ్యస్త రుతుపవనాలు, అనూహ్య వాతావరణ మార్పుల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం తరచూ 8 శాతం సమీపంలోనే కొనసాగుతున్నది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నంత స్థాయిలో జీతాలు పెరుగడంలేదు. ప్రజల చేతిలో మిగిలే జీతం డబ్బులు క్రమంగా తగ్గిపోతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రామాలతో పోల్చితే పట్టణ ప్రజలకు రుణాలు సులభంగా లభిస్తుండటంతో తమ ప్రతికూల పరిస్థితుల్లోనూ బతుకుబండి నెట్టుకొస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం డిమాండ్ బలహీనపడింది. గ్రామీణ కార్మికుల నామమాత్రపు వేతన వృద్ధి కేవలం 3.3 శాతంతో అత్యంత దయనీయంగా కొనసాగుతున్నది. దీంతో లక్షలాది మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మరింతగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తక్కువ ఆదాయం కలిగిన అనేక కుటుంబాల్లో కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా బంగారాన్ని తాకట్టు పెట్టి, రుణాలను తీసుకోవాల్సినంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే, అంతర్జాతీయంగా కూడా ప్రమాదకరమైన పరిణామాలు క్రమంగా బలపడుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో వడ్డీ రేట్లు పైస్థాయిలో కొనసాగుతుండటం, భారతీయ ఈక్విటీ మార్కెట్లలో షేర్లు అధిక ప్రీమియంతో ట్రేడవుతుండటంతో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుంచి బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ పెట్టుబడుల తరలింపు భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. రూపాయి విలువ అస్థిరత్వంలోకి జారిపోకుండా నిరోధించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రత్యేక డాలర్ విండోలు, సంక్లిష్టమైన కరెన్సీ స్వాప్ విధానాలను ఉపయోగించడం వంటి చర్యలను చేపట్టాల్సి వచ్చింది. కానీ కనిపించని వ్యయం కారణంగా విదేశీ చెల్లింపులను బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారుతున్నది.
భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 7 శాతం వృద్ధి రేటును కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, దాని వల్ల ఎదురయ్యే ప్రతికూల నష్ట భయాలను విస్మరించలేం. అంతర్జాతీయ చమురు ధరలు అధిక స్థాయిలోనే కొనసాగి, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కఠినంగానే ఉంటే, వృద్ధి రేటు సులభంగానే దిగజారే అవకాశం ఉన్నదని ఆర్థిక నమూనాలు సూచిస్తున్నాయి.
అంతిమంగా, రాబోయే సంవత్సరాల్లో ఆర్థిక విధానాలు కేవలం ఆకర్షణీయమైన గణాంకాలను చూపిస్తూ సంతృప్తి చెందకుండా, క్షేత్రస్థాయిలోని కఠిన వాస్తవాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. నిజమైన ఆర్థిక స్థిరత్వం, సామర్థ్యం అనేవి అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం రూపొందించే గణాంకాలు మాత్రమే కాదు. అవి ప్రజలు తమ నిత్యజీవితంలో అనుభవించే వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించాలి. మన ప్రగతికి అసలైన, సరళమైన పరీక్ష ఏంటంటే వ్యవసాయ కూలీలు, కార్మికులు, చిన్న దుకాణదారుల కొనుగోలు శక్తి ఈ రోజుతో పోల్చితే, ఓ ఏడాది తర్వాత పెరుగుతుందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పే పరిస్థితి ఇంకా లేదు.
సుక్కన్న
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

