దేశరాజధాని ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన తొలి ఖోఖో ప్రపంచకప్‌లో భారత్ సత్తా చాటింది. స్వదేశంలో ఆదివారం ముగిసిన మొదటి ఎడిషన్‌లో భారత పురుషుల, మహిళల జట్లు టైటిల్స్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాయి. అచ్చొచ్చిన స్వదేశీ క్రీడలో టోర్నీ ఆరంభం నుంచీ అసలు ఓటమన్నదే ఎరుగకుండా సత్తాచాటిన మన క్రీడాకారులు.. ఫైనల్లోనూ అదే ఆటతీరుతో తమకు ఎదురేలేదని నిరూపించారు. ఇరు విభాగాల్లోనూ నేపాల్ ప్రత్యర్థి కాగా రెండింట్లోనూ ఆ జట్టుకు పరాభవం తప్పలేదు.
అటాకింగ్‌లో స్కైడైవ్‌లు, చిరుత పులిలాంటి వేగం, పక్కా వ్యూహాలతో ప్రత్యర్థిని పలుమార్లు ఆలౌట్ చేసి పాయింట్లు రాబట్టుకున్న పురుషుల, మహిళల జట్లు.. డిఫెండింగ్‌లో నేపాల్ ఆటగాళ్లకు చిక్కకుండా వారికి కప్‌ను దూరం చేశారు.
Kho Kho World Cup | ఢిల్లీ: స్వదేశీ క్రీడ ఖోఖో తొలి ప్రపంచకప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత పురుషులు, మహిళల జట్లు మొదటి ఖోఖో ప్రపంచకప్ టైటిల్స్‌ను కైవసం చేసుకున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత పురుషుల జట్టు.. 54-36 (18 పాయింట్ల తేడా)తో నేపాల్‌ను ఓడించింది. అమ్మాయిలు సైతం 78-40 (38 పాయింట్ల తేడా)తో నేపాల్ మహిళల జట్టును చిత్తు చేసి సత్తా చాటారు.
ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లోనే రికార్డు స్కోరుతో దక్షిణ కొరియాను చిత్తుచిత్తుగా ఓడించిన భారత మహిళల జట్టు ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించింది. తొలి టర్న్‌లోనే భారత్.. నేపాల్ డిఫెండర్లపై ఎదురుదాడికి దిగింది. ఫస్ట్ టర్న్‌లో మూడు బ్యాచ్‌ల నేపాల్ ఆటగాళ్లను ఏడుసార్లు ఔట్ చేయడంతో 34 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. నేపాల్ సైతం అటాకింగ్‌లో చెలరేగడంతో ఆ జట్టుకు 24 పాయింట్లు దక్కాయి. మూడో టర్న్‌లో భారత్ మరింత దూకుడు పెంచింది. మూడో టర్న్ ముగిసేసరికి ఆధిక్యాన్ని 49కు పెంచుకుంది. నాలుగో టర్న్‌లో నేపాల్ 16 పాయింట్లు మాత్రమే సాధించడంతో భారత్ మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను దక్కించుకుంది.
ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే నేపాల్‌పై ఉత్కంఠ పోరులో నెగ్గిన భారత్.. ఫైనల్లోనూ టాస్ గెలిచి మొదట అటాకింగ్‌ను ఎంచుకుని ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఫస్ట్ టర్న్ ఆరంభంలో నేపాల్ డిఫెండర్లు కాస్త ప్రతిఘటించినా తర్వాత పట్టు తప్పారు. దీంతో మొదటి టర్న్ ముగిసేసరికి భారత్ 26 పాయింట్లు సాధించింది. అద్భుతమైన స్కైడైవ్‌లు, ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే వేగంతో కదలిన భారత్.. డిఫెండింగ్ లోనూ సత్తా చాటింది. రెండో టర్న్‌లో నేపాల్ 18 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. డిఫెండింగ్‌లో ఆదిత్య గణ్పుల్, కెప్టెన్ ప్రతీక్ వారియర్ అద్భుతంగా పోరాడారు. మూడో టర్న్‌లోనూ అదే జోరు కొనసాగించిన మన కుర్రాళ్లు.. అది ముగిసేసరికి 54-18తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించారు. చివరి టర్న్‌లో నేపాల్ మరో 18 పాయింట్లు మాత్రమే రాబట్టడంతో భారత్ 18 పాయింట్ల తేడాతో ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
తొలి ఖోఖో ప్రపంచకప్‌లో దేశానికి ‘డబుల్’ ఆనందం. పురుషుల, మహిళల జట్లు ఓటమన్నదే లేకుండా దేశానికి కీర్తిని తీసుకొచ్చాయి. ప్రపంచ చాంపియన్లకు అభినందనలు. ఆటగాళ్లు, కోచ్‌లకు సెల్యూట్.