నాగ్‌పూర్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు.. బుధవారం నుంచి ఆరంభమైన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. పరుగుల వరద పారిన మ్యాచ్‌లో టీమ్ఇండియాదే పైచేయి అయింది. ఇరుజట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20లో సూర్య సేన.. 48 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తుచేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 239 పరుగుల రికార్డు ఛేదనలో న్యూజిలాండ్.. 20 ఓవర్లకు 190/7కే పరిమితమైంది.
ఛేదనలో గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 78, 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), మార్క్ చాప్మన్ (24 బంతుల్లో 39, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా.. అభిషేక్ శర్మ (35 బంతుల్లో 84, 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీర విహారానికి తోడు ఆఖర్లో రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులతో ఆ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 రన్స్ చేసింది. అభిషేక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఈనెల 23న రాయ్‌పూర్‌లో జరుగుతుంది.
భారీ ఛేదనలో కివీస్ స్కోరుబోర్డు పరుగులేమీ చేరకముందే కాన్వే, రచిన్ వికెట్లను కోల్పోయింది. అర్ష్‌దీప్ తొలి ఓవర్లోనే శాంసన్ డైవింగ్ క్యాచ్‌తో కాన్వే ఔట్ అవగా రెండో ఓవర్లో హార్ధిక్.. రచిన్‌ను వెనక్కిపంపి ఆ జట్టును దెబ్బతీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్.. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మరో ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (21)తో కలిసి మూడో వికెట్‌కు 51 రన్స్ జోడించాడు.
7వ ఓవర్లో బంతినందుకున్న వరుణ్.. రాబిన్సన్ను బోల్తా కొట్టించినా బౌండరీలు, సిక్స్‌లతో రెచ్చిపోయిన ఫిలిప్స్ 29 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. అతడికి చాప్మన్ (39) అండగా నిలిచాడు. లక్ష్యం దిశ గా సాగుతున్న ఈ జోడీని అక్షర్.. 14వ ఓవర్లో ఫిలిప్స్‌ను ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇ చ్చాడు. అదే ఊపు లో వరుణ్.. చాప్మన్నూ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత కివీస్ బ్యాటర్ల మెరుపులు ఆ జట్టు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.
భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఆటే హైలైట్. తనదైన శైలిలో రెచ్చిపోయిన ఈ పంజాబ్ కుర్రాడు.. ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. సంజూ శాంసన్ (10), రెండేండ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (8) నిరాశపరిచినా కెప్టెన్ సూర్యకుమార్ (32) అండతో అతడు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. డఫ్ఫీ తొలి ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్‌గా మలిచి పరుగుల వేట మొదలుపెట్టిన అతడు.. జెమీసన్ 5వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టాడు. సూర్య కూడా దూకుడుగా ఆడటంతో రన్‌రేట్ పరుగులు పెట్టింది. ఫిలిప్స్ 8వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన అభిషేక్ 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేశాడు.
ఈ ఇద్దరి బాదుడుతో 8.4 ఓవర్లలోనే భారత స్కోరు వంద పరుగుల మార్కును దాటింది. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన సూర్య.. డ్రింక్స్ విరామం అనంతరం శాంట్నర్ వేసిన 11వ ఓవర్లో నాలుగో బంతికి రాబిన్సన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సోధి వేసిన మరుసటి ఓవర్లోనే అభిషేక్.. 4, 6, 6తో సెంచరీకి చేరువగా వచ్చినా ఆఖరి బంతికి జెమీసన్ చేతికి చిక్కాడు. హార్ధిక్ (16 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించినా డఫ్ఫీ 16వ ఓవర్లో చాప్‌మన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆఖర్లో రింకూ.. 18వ ఓవర్లో 14, 20వ ఓవర్లో 21 రన్స్ రాబట్టడంతో భారత్ భారీ స్కోరు చేసింది.
భారత్: 20 ఓవర్లకు 238/7 (అభిషేక్ 84, రింకూ 44*, డఫ్ఫీ 2/27, జెమీసన్ 2/54)
న్యూజిలాండ్: 20 ఓవర్లకు 190/7 (ఫిలిప్స్ 78, చాప్మన్ 39, దూబె 2/28, వరుణ్ 2/37)