దుబాయ్ : టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20లలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఆసియా కప్‌లో విధ్వంసకరమైన ఆటతీరుతో రెచ్చిపోయిన అభిషేక్.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 931 పాయింట్లు సాధించి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో ఒక బ్యాటర్ ఇన్ని పాయింట్లు సాధించడం ఇదే మొదటిసారి.
గతంలో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలన్ 919 పాయింట్లు (2020లో) సాధించడమే ఇప్పటిదాకా రికార్డు. భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ (912), విరాట్ కోహ్లీ (909) నెలకొల్పిన రికార్డులూ అభిషేక్ తుఫానులో తుడిచిపెట్టుకుపోయాయి. ర్యాంకింగ్ జాబితాలో అభిషేక్ తర్వాత ఫిల్ సాల్ట్ (844), హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ (819) వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. ఏడాది క్రితమే టీ20లలో అరంగేట్రం చేసిన అభిషేక్.. ఆసియా కప్‌లో 314 రన్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ అవార్డు గెలుచుకున్న విషయం విదితమే.