AB de Villiers : దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. ఆటకు వీడ్కోలు పలికిన ఈ విధ్వంసక ప్లేయర్ తాజాగా తన కెరీర్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గ్రౌండ్ నలువైపులా షాట్లతో అలరించిన అతను ముగ్గురు బౌలర్లను ఎదుర్కొనేందుకు మాత్రం కష్టపడ్డాడట. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్(Shane Warne), టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah), అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan)లు తనను ఇబ్బంది పెట్టారని ఈ మిస్టర్ 360 ప్లేయర్ తెలిపాడు.
భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప(Robin Uthappa)తో కలిసి జియో సినిమా(Jio Cinema) షోలో డివిలియర్స్ మాట్లాడాడు. ఈ ముగ్గురు బౌలర్లు ఎందుకు బెస్ట్ అనేది కూడా చెప్పుకొచ్చాడు. ‘నేను 2006 ఆస్ట్రేలియా పర్యటకు వెళ్లినప్పుడు షేన్ వార్న్ బౌలింగ్‌లో ఆడేందుకు ఇబ్బంది పడ్డాను. అతడి లెగ్ స్పిన్ నైపుణ్యం, టెక్నిక్ మాత్రమే కాదు అతడి ఆరా(నీడ) కూడా ప్రత్యర్థులను భయపెట్టేది. అతడి బౌలింగ్‌లో ఔటవుతానని ముందే అనిపించేది’ అని డివిలియర్స్ అన్నాడు.
రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా
ఇక భారత పేస్ గుర్రం బుమ్రాను ఒక చాలెంజింగ్ బౌలర్‌గా పేర్కొన్నాడు. ‘బుమ్రా ఎల్లప్పుడూ పోటీనిస్తుంటాడు. ఎప్పుడూ బ్యాటర్లకు తలవంచడు. అందుకనే అతడంటే నాకు చాలా గౌరవం. అయితే.. కొన్నిసార్లు నేను బుమ్రాపై అధిపత్యం చెలాయించాను. మరికొన్ని సందర్భాల్లో బుమ్రా నన్ను కట్టడి చేశాడు అఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక అటాకింగ్ బౌలర్. నేను అతడిపై కొన్నిసార్లు పైచేయి సాధించాను. అయితే.. రషీద్ కూడా నన్ను చాలాసార్లు ఔట్ చేశాడు. అతడి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు కొడితే.. నాలుగో బంతికి నన్ను ఔట్ చేసేందుకు ప్రయత్నించేవాడు. అందుకనే అతడిని ఎదుర్కోవడం కష్టంగా అనిపించేది’ అని డివిలియర్స్ వివరించాడు. మెరుపు ఇన్నింగ్స్‌లకు కేరాఫ్‌గా నిలిచిన అతను ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
2015 వరల్డ్ కప్‌లో రికార్డు సెంచరీ కొట్టిన డివిలియర్స్
డివిలియర్స్ 138 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో, వేగవంతమైన సెంచరీ, 150 రన్స్ కొట్టిన రికార్డు అతడి పేరు మీదే ఉంది. ఈ స్టార్ క్రికెటర్ టెస్టుల్లో 22, వన్డేల్లో 25 సెంచరీలు బాదాడు. ఐపీఎల్(IPL)లోనూ డివిలియర్స్ మెరుపులు మెరిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టుకు ఆడి 5,030 పరుగులు చేశాడు. అందులో 3 శతకాలు, 38 అర్ధ శతకాలు ఉన్నాయి.