నెల్లికుదురు, నవంబర్ 4: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆర్చరీ(విలువిద్య), ఫెన్సింగ్(కత్తిసాము) రాష్ట్ర స్థాయి 68వ ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి 600 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. 14, 17, 19 వయస్సు విభాగంలో బాలబాలికలకు విలువిద్య, కత్తిసాము క్రీడలు 2 రోజుల పాటు జరుగనున్నాయి. ఈ క్రీడలకు రాష్ట్ర పరిశీలకులుగా కడారి రవి వ్యవహరిస్తున్నారు.
విలు విద్య క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు గుజరాత్ రాష్ట్రంలోని నడియాడులో, కత్తిసాములో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లు పాట్నాలో జరిగే జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటారు. ఎంఈవో ఏ రాందాస్, హెచ్ఎంలు రవి, జీవన్ కుమార్, పీడీలు ఐలయ్య, ప్రవీణ్, సునీత, మధుకర్, టెక్నికల్ పర్సన్లు హరికృష్ణ, శ్రీనివాస్, పుల్లయ్య, ఎస్జీఎఫ్ కార్యదర్శి సత్యనారాయణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.