ముంబై : ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ట్రోఫీ నెగ్గిన విజేతలే మళ్లీ మళ్లీ కప్ కొట్టడాన్ని చూసి అభిమానులకు బోర్ కొట్టిందా? 18వ సీజన్లో వాళ్లు కొత్త విజేతను చూడాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ మేరకు ‘23 వాట్స్ ఇన్సైట్స్ స్టూడియో’ అనే ఒక సంస్థ ‘ది ఐపీఎల్ పల్స్’ పేరిట ఒక సర్వేను నిర్వహించింది. ఢిల్లీ, లక్నో, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో సుమారు 5 వేల మంది అభిమానుల వద్ద అభిప్రాయాలను సేకరించగా వారిలో ఏకంగా 65 శాతం మంది ఈ సీజన్లో ఇప్పటికే కప్పు కొట్టిన జట్లు కాకుండా కొత్త విజేతలను చూడాలనుకుంటున్నట్టు అభిప్రాయపడ్డారు.
అదీగాక ఐపీఎల్-18లో అదిరిపోయే ఆటతో సమిష్టిగా రాణిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 ఏండ్ల టైటిల్ కలను నెరవేర్చుకోవాలని 44 శాతం మంది కోరుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ విజేతగా నిలవాలని 12 శాతం మంది అభిప్రాయపడగా.. పంజాబ్ కింగ్స్‌ను చాంపియన్‌గా చూడాలనుకుంటున్నట్టు 7 శాతం మంది చెప్పారు. ఈ మూడు జట్లూ ఐపీఎల్లో ఇప్పటి వరకూ కప్పు కొట్టలేదు. మే 05 నాటికి ఈ అభిప్రాయాలను సేకరించినట్టు ‘23 వాట్స్’ తెలిపింది. కాగా ఈ సీజన్లో ఇప్పటి దాకా ఆడిన 12 మ్యాచ్‌లలో 8 గెలిచిన బెంగళూరు.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న విషయం విదితమే.
నాలుగు పదుల వయసులోనూ ఐపీఎల్లో ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరికొన్ని సీజన్ల పాటు కొనసాగాలని 77 శాతం మంది చెప్పారు. ఈ సీజన్లో బ్యాటింగ్ విషయంలో ధోనీ తడబడుతున్నప్పటికీ అతడుంటే ఆటకు ఓ అందం వస్తుందని అభిప్రాయపడ్డారు. 35 శాతం మంది చెన్నై జట్టుకు ధోనీ ఆత్మ (సోల్ ఆఫ్ సీఎస్కే) వంటి వాడని తెలిపారు. 27 శాతం మంది ధోనీ రిటైర్ అయి సీఎస్కేకు మెంటార్‌గా ఉండాలని అన్నారు.
13 ఏండ్లకే ఐపీఎల్ వేలంలోకి వచ్చి 14 ఏండ్ల వయసులో ఈ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై ఐపీఎల్ ఫ్యాన్స్ మనసు పారేసుకున్నారు. ఈ సీజన్లో అరంగేట్రం చేసి ఆకట్టున్న వారిలో వైభవ్ 31 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా ముంబై పేసర్ అశ్వని కుమార్ (21శాతం) రెండో స్థానంలో నిలిచాడు.
ఇక ఈ సీజన్లో బ్యాటర్లు ఎదుర్కున్న అత్యంత కఠిన బౌలర్ ఎవరన్న దానిపై 32 శాతం మంది బుమ్రాకు ఓటేయగా 28 శాతం మంది చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ వైపునకు మొగ్గుచూపారు. మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్ (16 శాతం) ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌పై క్రికెట్ వర్గాల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా 78 శాతం మంది ఈ నిబంధన వల్ల ఆట మరింత రసవత్తరంగా మారిందని అభిప్రాయపడటం విశేషం. 20 శాతం మంది మాత్రం ఇది ఆల్రౌండర్లను దెబ్బతీస్తుందని తెలిపారు.