హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ వేదికగా ఒలింపిక్ డే రన్ ఘనంగా జరిగింది. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని వివిధ స్టేడియాల నుంచి ప్లేయర్లు కాగడాలు చేతబూని రోడ్లపై పరుగులు పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి ప్లేయర్లు, క్రీడా ఔత్సాహికులతో కూడిన ర్యాలీలు చివరికి ఎల్బీ స్టేడియానికి చేరుకున్నాయి.
రావుల శ్రీధర్‌రెడ్డి స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, టీవోఏ చైర్మన్ వేణుగోపాలచారి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్‌యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. మౌలిక వసతులు కల్పిస్తూ మెరికల్లాంటి ప్లేయర్లను తీర్చిదిద్దుతున్నది. ఇటీవలే సీఎం కప్ అట్టహాసంగా నిర్వహించుకున్నాం. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో క్రీడా సంస్కృతి వెల్లువిరిసేలా క్రీడా సంఘాలు, ప్లేయర్లు, క్రీడాభిమానులతో కలిసి ముందుకు సాగుతాం’ అని అన్నారు.