Women Umpire | మహిళల టీ20 ప్రపంచ కప్ మూడు రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో ప్రారంభమైంది. ఆతిథ్య జట్టును ఓడించడం ద్వారా తొలి రోజు శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఇదే రోజు మరో రికార్డు కూడా నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ క్రీడాకారిణి అన్నా హారిస్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించి కొత్త చరిత్ర తన పేరిట లిఖించుకున్నది.
24 సంవత్సరాల 118 రోజుల వయస్సులో ఐసీసీ ఈవెంట్లో అధికారికంగా వ్యవహరించిన రెండవ అతి పిన్న వయస్సు అంపైర్‌గా హారిస్ నిలిచింది. ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన లారెన్ అగెమ్బాగ్ పేరిట ఉన్నది. ఆమె 23 సంవత్సరాల వయస్సులో టీ 20 ప్రపంచ కప్‌లో అంపైర్ నియమితులైంది. ఈ టోర్నమెంట్లో వివిధ జట్లకు చెందిన 17 మంది ఆటగాళ్లు అన్నా హారిస్ కంటే పెద్దవారు. అన్నా హారిస్ తన పేరిట మరో ప్రపంచ రికార్డు కూడా నమోదు చేసుకున్నది. 2021 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన మహిళల వన్డే సిరీస్‌లో అధికారికంగా అంపైర్‌గా వ్యవహరించింది. అప్పుడు ఆమెకు 22 సంవత్సరాలు. దాంతో అంతర్జాతీయ మ్యాచ్‌లో అతి పిన్న వయస్కురాలైన అంపైర్‌గా అన్నా హారిస్ నిలిచింది.
ప్రస్తుతం కార్డిఫ్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నది. క్రీడలతో ఆమెకు ఐదేండ్ల వయస్సు నుంచే మొదలైంది. స్కూలింగ్ టైమ్‌లో ఆమె టీచర్ క్రికెట్ కిట్లు తీసుకొచ్చి ఇచ్చేవారు. అక్కడి నుంచి అన్నా హారిస్‌కు క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగింది. కొన్ని రోజుల తర్వాత స్థానిక క్రికెట్ క్లబ్లో చేరతానని తల్లిని కోరగా.. వృత్తిరీత్యా అంపైర్ కూడా అయిన ఆమె తల్లి ఆమెను అంపైరింగ్ కోర్సు చేయమని సూచించింది. దాంతో 2021 మే నెలలో అన్నా హారిస్.. వైవోన్నే డాల్ఫిన్ కూపర్‌తో కలిసి వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్‌లో అంపైరింగ్ చేసి వృత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం వరల్డ్ కప్‌కు అంపైరింగ్ చేసే అవకాశం రావడంతో అన్నా హారిస్ పేరు మార్మోగిపోతున్నది.