సోమవారం 26 అక్టోబర్ 2020
Sports - Sep 30, 2020 , 21:25:35

RR vs KKR: చెలరేగిన ఆర్చర్‌.. కోల్‌కతా స్కోరు 174

RR vs KKR: చెలరేగిన ఆర్చర్‌.. కోల్‌కతా స్కోరు 174

దుబాయ్: ఐపీఎల్‌-13లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు.  స్టార్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌(2/18) అత్యద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.  మిగతా బౌలర్లు సైతం విజృంభించడంతో  వరుస విరామాల్లో కోల్‌కతా వికెట్లు   కోల్పోవడంతో  భారీ స్కోరు చేయలేకపోయింది. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(47: 34 బంతుల్లో 5ఫోర్లు,  సిక్స్‌)  టాప్‌ స్కోరర్‌. ఆఖర్లో ఇయాన్‌ మోర్గాన్‌(34 నాటౌట్:‌ 23 బంతుల్లో ఫోర్‌, 2సిక్సర్లు)  పోరాడటంతో    కోల్‌కతా  20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది.  

టాస్‌ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించింది. పవర్‌ప్లే ముగిసేసరికి కోల్‌కతా వికెట్‌ నష్టానికి 42  పరుగులు చేసింది. మొదటి ఆరు ఓవర్లలో తమ బౌలర్లను రాజస్థాన్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. పవర్‌ప్లేలో ఏకంగా ఐదుగురు బౌలర్లను రంగంలోకి దించాడు.  అందరూ గొప్పగా బంతులేసి  కోల్‌కతాను నియంత్రించారు.  కోల్‌కతా  భారీగా పరుగులు చేయకుండా బౌలర్లు బ్రేక్‌ వేశారు. ఉనద్కత్‌  వేసిన ఐదో ఓవర్లో ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(15: 14 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది తర్వాతి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. 

రాహుల్‌ తెవాటియా వేసిన 10వ ఓవర్లో నితీశ్‌ రాణా దూకుడుగా ఆడే క్రమంలో వికెట్‌ చేజార్చుకున్నాడు.  ఆ తర్వాత కొద్దిసేపటికే  యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌  అర్ధశతకానికి చేరువలో వెనుదిరిగాడు.  జోఫ్రా ఆర్చర్‌ వేసిన 12వ ఓవర్లో గిల్‌.. రిటర్న్‌ క్యాచ్‌  ఇచ్చి ఔటయ్యాడు.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రస్సెల్‌(24), దినేశ్‌ కార్తీక్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతారని భావించారు. ఆర్చర్‌ బౌలింగ్‌లో  కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(1)  పెవిలియన్‌ చేరాడు.  స్కోరు వేగం మందగించడంతో   రస్సెల్‌  భారీ షాట్లతో చెలరేగే ప్రయత్నం చేసినా రాజ్‌పుత్‌ అతన్ని పెవిలియన్‌ పంపాడు.   చివరి ఓవర్లలో  మోర్గాన్‌ సంయమనంతో బ్యాటింగ్‌ చేస్తూ జట్టుకు పోరాడే స్కోరును అందించాడు. logo