పొట్టి ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన అనంతరం న్యూజిలాండ్‌పై విజయంతో కొత్త సీజన్‌ను ఆరంభించిన టీమ్ఇండియా.. ఇక సిరీస్‌పై కన్నేసింది. కివీస్‌తో నేడు జరుగనున్న రెండో టీ20లో గెలిచి ట్రోఫీ పట్టేయాలని రోహిత్ సేన చూస్తుంటే.. సమిష్టిగా రాణించి సిరీస్ సమం చేయాలని కివీస్ భావిస్తున్నది. సెకండ్ ఇన్నింగ్స్‌లో తేమ ప్రభావం చూపనుండటంతో.. మరోసారి టాస్ కీలకంగా మారనుంది!
రాంచీ: కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో తొలి మ్యాచ్ నెగ్గిన టీమ్ఇండియా.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీ20 సిరీస్‌లో బోణీ కొట్టిన భారత్.. శుక్రవారం రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. టాపార్డర్ ఫామ్‌లో ఉండటం.. సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగుతుండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశాలు కాగా.. తొలి మ్యాచ్ తప్పిదాలను సరిదిద్దుకొని తిరిగి గెలుపు బాట పట్టాలని కివీస్ చూస్తున్నది. బుధవారం జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్ స్వేచ్చగా ఆడగా.. మూడో స్థానంలో బరిలోకి దిగిన సూర్యకుమార్ చక్కటి ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కాస్త ఇబ్బంది పడగా.. అరంగేట్రం చేసిన వెంకటేశ్ అయ్యర్ ఒత్తిడిలో వికెట్ సమర్పించుకున్నాడు. రిషబ్ పంత్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించినా.. మిడిలార్డర్ గాడిన పడితేనే జట్టు బలోపేతంగా మారుతుందని మేనేజ్మెంట్ భావిస్తున్నది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ లయ దొరకబుచ్చుకోవడం టీమ్ఇండియాకు సానుకూలాంశం కాగా.. దీపక్ చాహర్, మహమ్మద్ సిరాజ్ పరుగుల నియంత్రణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నాలుగేండ్ల తర్వాత పొట్టి ఫార్మాట్లో అవకాశాలు దక్కించుకుంటున్న రవిచంద్రన్ అశ్విన్ మరోసారి మాయ చేస్తే రోహిత్ సేన సిరీస్ నెగ్గడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సూర్యకుమార్, పంత్, శ్రేయస్, వెంకటేశ్, అక్షర్/చాహల్, దీపక్, అశ్విన్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్.
న్యూజిలాండ్: సౌథీ (కెప్టెన్), గప్టిల్, మిచెల్, చాప్మన్, ఫిలిప్స్, సీఫెర్ట్, నీషమ్, శాంట్నర్, బౌల్ట్, ఫెర్గూసన్, సోధి.
ఇప్పటి వరకు ఇక్కడ రెండు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరుగగా.. అందులో ఒకటి వర్షార్పణం అయింది. శుక్రవారం వాతావరణం మేఘావృతమై ఉండనుంది. రాత్రి అవుతున్నా కొద్ది తేమ ప్రభావం పెరుగనుండటంతో.. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గుచూపొచ్చు. 39 వేల మంది సామర్థ్యం గల స్టేడియంలో టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.