ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Jan 27, 2021 , 00:49:23

భూనిర్వాసితుల త్యాగాన్ని మరువం

భూనిర్వాసితుల త్యాగాన్ని మరువం

ముంపు కుటుంబాలను ప్రభుత్వం  గుండెల్లో పెట్టుకుంటుంది.. 

దేశంలోనే మెరుగైన ప్యాకేజీ అందించాం..

మినరల్‌ వాటర్‌ వద్దు.. భగీరథ వాటర్‌ ముద్దు

అన్నిరంగాల్లో జిల్లా అభివృద్ధి

ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు, తాగునీటికి భరోసా

మారుతున్న పల్లెల రూపురేఖలు

72వ గణతంత్ర  వేడుకల్లో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

భూనిర్వాసిత కుటుంబాల త్యాగఫలమే సాగునీటి ప్రాజెక్టులు

భూనిర్వాసితుల కుటుంబాల త్యాగ ఫలితంగానే సాగునీటి ప్రాజెక్టులు కట్టగలిగామని, వారి త్యాగాన్ని మరువమని, ముంపునకు గురైన కుటుంబాలకు దేశంలోనే మెరుగైన ప్యాకేజీతో పునరావాసం కల్పించి వారిని ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటుందని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌ ఆవరణలో ఆయన  జాతీయ జెండాను ఆవిష్కరించి జెండావందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు, తాగునీటి వెతలు తీరాయన్నారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని కుళాయిల ద్వారా అందిస్తున్నామని, ప్రజలు మిషన్‌ భగీరథ నీటినే తాగాలని కోరారు. అన్నిరంగాల్లో జిల్లా  అభివృద్ధి చెందుతున్నదని, రైతాంగానికి అన్నివిధాలుగా ప్రభుత్వం అండగా ఉంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు లక్షిత వర్గాలే  లక్షంగా పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

- సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 26 

సిద్దిపేట కలెక్టరేట్‌, జనవరి 26 : 

భూ నిర్వాసితుల కుటుంబాల త్యాగ ఫలమే సాగునీటి ప్రాజెక్టులని, వారి త్యాగాన్ని మరువమని, ముంపునకు గురైన కుటుంబాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన ప్యాకేజీతో పునరావాసం కల్పించి వారిని ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుంటుందని   కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌ ఆవరణలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజమ్మీల్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జెండావందనం చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ సందేశం ఇచ్చారు. ప్రతి ఎకరాకు సాగు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు, కొద్దికాలంలోనే 28వేల రైతు కుటుంబాల నుంచి సుమారు 50వేల ఎకరాల భూమి సేకరించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. 13 ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించినట్లు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంలో తనకు అవకాశం దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. ఇందుకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు కలెక్టర్‌ ధన్యవాదాలు తెలిపారు. భూ సేకరణకు సహకరించిన ప్రజాప్రతినిధులకు కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ప్యాకేజీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ముంపు బాధితులకు ఎంత చేసినా తక్కువేనని సీఎం కేసీఆర్‌ భావించి, దేశంలో ఎక్కడా లేని విధంగా ముట్రాజ్‌పల్లి, లింగారెడ్డిపల్లి, తునికి బొల్లారంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను నిర్మించారని తెలిపారు. 

భూనిర్వాసిత కుటుంబాల త్యాగఫలమే సాగునీటి ప్రాజెక్టులు

ప్రగతి పథంలో సిద్దిపేట జిల్లా..

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు మార్గదర్శనం, పర్యవేక్షణలో సిద్దిపేట జిల్లా అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిచిందని కలెక్టర్‌ అన్నారు. జిల్లా ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషిచేస్తుందని తెలిపారు. దేశంలో భూ నిర్వాసితులతో సహపంక్తి భోజనం చేసి సామూహిక గృహప్రవేశాలు చేసిన ఘనత సిద్దిపేట జిల్లా యంత్రాంగానికే దక్కిందన్నారు. రైతును రాజు చేయడం కోసం ప్రభుత్వ కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం అవుతామంటూ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.

2020-21లో 6,671 ఎకరాల్లో శనగ, 97,714 ఎకరాల్లో వరి సాగు, 3,244 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 7,056 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేసినట్లు తెలిపారు. 11,722 మెట్రిక్‌ టన్నుల యూరియా, 851 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 3,574 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను పంపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు. 2,065 క్వింటాళ్ల వరి, 1011 క్వింటాళ్ల శనగ, 360 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు 

తెలిపారు. 

రైతుబంధు ద్వారా యాసంగికి 2,84,580 మంది రైతుల ఖాతాల్లో రూ.304.43 కోట్లను ప్రభుత్వం జమ చేసిందన్నారు. 2020-21కి 1,61,065 మంది రైతులకు రూ.56.16కోట్ల రైతుబీమా ప్రీమియం కట్టామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 373 మంది రైతులు చనిపోతే, 288 మంది రైతులకు రూ.14కోట్ల బీమా సొమ్మును రైతులకు అందించినట్లు చెప్పారు.

జిల్లాలో రైతుల కోసం127 రైతు వేదికలను నిర్మిస్తున్నామని, ఇందులో 124 వేదికల పనులు పూర్తయినట్లు తెలిపారు. 3 పురోగతిలో ఉన్నాయన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు అనంతగిరి రిజర్వాయర్‌ ద్వారా 15,200 ఎకరాలకు, రంగనాయకసాగర్‌ ద్వారా 77,600 ఎకరాలకు, మల్లన్న సాగర్‌ ద్వారా 2,88,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. రిజర్వాయర్ల కుడి, ఎడమ కాల్వల ద్వారా చెరువులను నింపేందుకు ప్రభుత్వం పనులు చేస్తోందన్నారు. 

మిషన్‌ కాకతీయ పథకంతో జిల్లాలో 2140 చెరువులను రూ.536 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టామని, అందులో 1988 చెరువుల పునరుద్ధరణ పూర్తి కాగా, 152 చెరువులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.28.55 కోట్లతో శనిగరం, సింగరాయ ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపట్టామన్నారు. 

హరితహారం ద్వారా జిల్లాలో 2020-21లో, 53.09 కోట్ల మొక్కలను నాటామన్నారు. అటవీ శాఖ ద్వారా కొత్త కలెక్టరేట్‌ వద్ద 138 హెక్టార్లలో తెజోవనం, సంగాపూర్‌ వద్ద 117 హెక్టార్లలో కల్పక వనం, చింతమడక రిజర్వ్‌ పారెస్ట్‌ను అర్బన్‌ పార్కుగా అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నర్సరీల ద్వారా 8.75 కోట్ల మొక్కలను పెంచనున్నట్లు తెలిపారు.                            

జిల్లాకు 14,660 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజారు కాగా, 11467 ఇండ్ల నిర్మాణం ప్రారంభించగా, అందులో 7,875 ఇండ్ల గృహప్రవేశాలు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 460 పల్లె ప్రకృతివనాలకు గాను 404 పూర్తి కాగా, 19 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. వైకుంఠధామాలు 289 పూర్తికాగా, 197 పురోగతిలో ఉన్నాయని చెప్పారు. 470 డంపింగ్‌ యార్డులు పూర్తికాగా, 19 పనులు జరుగుతున్నాయన్నారు. 

ఈజీఎస్‌లో 2,05,986 జాబ్‌కార్డుల ద్వారా 4,20,714 కుటుంబాలకు 61,89,166 పనిదినాలు కల్పించామన్నారు. 

జిల్లాలో ఆసరా పథకం కింద 1,76,977 మందికి ప్రతినెలా రూ. 37.18కోట్లు పింఛన్ల రూపంలో అందిస్తున్నామని తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 10,352 మహిళా సంఘాలకు రూ.358.10 కోట్ల రుణాలు, కొవిడ్‌ రుణం కింద రూ.64.12 కోట్లు, స్త్రీనిధి కింద 42.56 కోట్ల రుణాలను అందించామన్నారు. 

ధరణి పోర్టల్‌లో భాగంగా నవంబర్‌ 2 నుంచి ఇప్పటి వరకు 1,00,310 రిజిస్ట్రేషన్లు చేశామన్నారు. 

వైద్యఆరోగ్య శాఖ ద్వారా కరోనా సమయంలో 2,93,193 మందికి పరీక్షలు చేశామని, వారిలో 12,189 మంది పాజిటివ్‌ వచ్చిందన్నారు.12 వేల మంది వ్యాధి నుంచి కోలుకున్నారని తెలిపారు. 42 కేంద్రాల ద్వారా 5,517 మందికి టీకా వేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలను తెరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటితో పాటు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు.

మినరల్‌ వాటర్‌ వద్దు.. భగీరథ వాటర్‌ ముద్దు..

మార్కెట్‌లో దొరుకుతున్న మినరల్‌ వాటర్‌కంటే ‘మిషన్‌ భగీరథ’ నీరు సురక్షితమని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఆధునిక టెక్నాలజీతో మిషన్‌ భగీరథ నీటిశుద్ధి జరుగుతోందని తెలిపారు. భగీరథ నీరు తప్ప మినరల్‌ వాటర్‌ మేము తాగం అనే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఈ సందర్భంగా కలెక్టర్‌ మిషన్‌ భగీరథ నీటిని తాగారు. అనంతరం వేడుకలకు హాజరైన అతిథులకు మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిళ్లను పంపిణీ చేశారు. 

VIDEOS

logo