మదుపరులు తీసుకునే నిర్ణయాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులే పెద్దది. రియల్టీలో పెట్టుబడులు పెడుతున్నప్పుడు.. దానిపై ఆకర్షణీయమైన రాబడులు వచ్చేలా చూసుకోవాలి. నిజానికి స్థిరాస్తిపై మీరు పెట్టుబడులకు వెళ్లకపోతే దీర్ఘకాలంలో మీ సంపద వృద్ధి లేనట్టేననుకోవచ్చు. కాబట్టి సరైన ప్రాపర్టీలో పెట్టుబడులే మీ కెరియర్లో కీలకం. ప్రస్తుతం దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ లాభదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చు. కరోనా సమయంలో తీవ్రంగా ప్రభావితమైన ఈ రంగం.. ఇప్పుడు దాదాపుగా పూర్తిస్థాయిలో కోలుకున్నది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇలా ముందుకెళ్లండి.
ప్రాంతమే కీలకం
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు.. ప్రాంతమే అత్యంత కీలకం. ఏరియా, లొకేషన్లనుబట్టే రియల్టీ ఇన్వెస్ట్మెంట్లలో రాబడులపై ఓ అంచనాకు రావచ్చు మరి. అందుకే స్థలమైనా, ఇండిపెండెంట్ హౌజ్ అయినా, అపార్ట్మెంట్లో ఫ్లాటైనా.. ప్రాపర్టీ లోకేషన్ చాలాచాలా ముఖ్యం. రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్లు, పాఠశాలలు, కళాశాలలు, దవాఖానలు ఇలా అన్ని సదుపాయాలుంటే ఉత్తమం. ధర ఎక్కువైనాసరే ఇక్కడే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపండి. దీనివల్ల మీ పెట్టుబడికి వేగవంతమైన లాభాలు రాగలవు. అద్దెకు ఇవ్వాలన్నా ఇలాంటి ఏరియాల్లోనే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో అమ్ముకున్నా ఇట్టే అమ్ముడుపోతుంది. ఇక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లకు దిగేవారు.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంచుకోవచ్చు. నగర శివార్లను కూడా పరిశీలించవచ్చు. ఇక్కడ ధరలు కూడా తక్కువగా ఉంటాయి.
ప్రాపర్టీ రకం
రియల్టీ మదుపరులు తాము కొనే ప్రాపర్టీపైనా ఓ స్పష్టమైన అవగాహనను కలిగి ఉండటం చాలాచాలా అవసరం. పూర్తయిన ప్రాజెక్టుల్లో కొనాలా? లేదా రీసేల్ లేక నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలా? కాదంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకోవాలా? అన్నదానిపై ముందే స్పష్టతను తెచ్చుకోవడం ఉత్తమం. పూర్తయిన ప్రాజెక్టుల్లోకి వెళ్తే.. ఆలస్యం ఉండదు. వెంటనే మన ఆస్తిని మనం దక్కించుకోవచ్చు. అలాకాకుండా నిర్మాణంలో ఉన్న ఇంటిని లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్‌ను తీసుకుంటే ధరలు తక్కువగా ఉన్నప్పటికీ.. బిల్డర్లు ఆలస్యం చేస్తే నష్టపోయే ప్రమాదం ఉన్నది. అయితే బిల్డర్లు సరైనవారే అయితే మాత్రం లాభాలూ ఉంటాయి. నిర్మాణానికి వినియోగించే ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించవచ్చు. మనకు నచ్చినట్టు ఇంటీరియర్ డిజైన్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. కానీ ఇందుకు కొంత సొమ్మును అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
డాక్యుమెంట్లు
దళారీల ద్వారానైనా, నమ్మకస్తుల ద్వారానైనా స్థిరాస్తులు కొంటున్నప్పుడు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రాపర్టీ ఎలా ఉన్నా.. డాక్యుమెంట్లు సరిగా లేకపోతే మన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరేనని గుర్తుంచుకోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్, అనుమతులు లేకపోవడం వంటివి ఇన్వెస్టర్లకు పెద్ద తలనొప్పే. ప్రతీచోటా ఈసీలు తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే రుణాలు దొరకవు. దొరికినా అధిక వడ్డీలతో తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇక లీగల్ ఇష్యూస్ ఎదురైతే వాటి నుంచి బయటపడటం అంత ఆషామాషీ కాదు. కనుక ఏదైనా స్థలం లేదా ఇల్లు, ఫ్లాట్లు కొనేముందే వాటి పత్రాలను చూడాలి. న్యాయ నిపుణులను సంప్రదించి వారి సలహాలను కూడా తీసుకోవడం ఉత్తమం. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు తీసుకుని మోసపోయినవారెందరో ఉన్నారు. అలాగే ప్రభుత్వ ప్రాజెక్టులు వచ్చే చోట, ప్రభుత్వ స్థలాలు కొనుక్కుని కూడా మోసపోయారు. అందుకే ఈ విషయంలో జాగ్రత్త చాలాచాలా అవసరం.
పెట్టుబడి ఉద్దేశం
రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు దిగే ముందు మన లక్ష్యాలను తెలుసుకోవాలి. కేవలం పెట్టుబడిపరంగానే చూస్తున్నామా? లేక భవిష్యత్తులో అక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? కాదంటే అద్దెకు ఇచ్చుకుని దానిపై వచ్చే ఆదాయాన్ని తీసుకోవాలనుకుంటున్నామా? అన్నదానిపై ఇన్వెస్టర్‌కు అవగాహన అవసరం. పెట్టుబడి కోసమే అయితే తక్కువ ధరతో దీర్ఘకాల పెట్టుబడులకు వెళ్లవచ్చు. దూరమైనాసరే ఏదో ఒక వెంచర్లో అన్నింటినీ గమనించి ఓ నిర్ణయం తీసుకోవచ్చు. అలాకాకుండా నిర్ణీత వ్యవధి అనంతరం స్థిర నివాసానికి ప్లాన్ చేసుకోవాలనుకుంటే.. పరిసరాల్ని పరిశీలించాలి. భవిష్యత్తులో రవాణాపరంగా, విద్య, వైద్యసదుపాయాలుండేలా చూసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. అపార్ట్మెంట్ ఫ్లాటైతే.. ఆ భవనం వయసు, అనుమతులు, పార్కింగ్, త్రాగునీటి సరఫరా, చుట్టూ ఉన్నవారిని కూడా గమనించడం అవసరం.