న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ (Swati Maliwal) పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో దాడి జరిగినట్లు తెలుస్తున్నది. వారం రోజులు విదేశాల్లో ఉన్న ఆమె ఢిల్లీ చేరుకున్న తర్వాత బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్‌ను కలిసేందుకు సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. అయితే కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ అడ్డుకోవడంతోపాటు తనపై దాడి చేసినట్లు స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె నుంచి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
కాగా, సోమవారం ఉదయం 9.40 గంటలకు 100కు మొదటి ఫోన్ కాల్‌ను ఒక మహిళ చేసిందని అయితే తన పేరును ఆమె ప్రస్తావించలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఉదయం 9.54 గంటల సమయంలో రెండో ఫోన్ కాల్ వచ్చినప్పడు తన పేరు స్వాతి మలివాల్ అని, ఢిల్లీ సీఎం సహాయకుడు బిభవ్ కుమార్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు చెప్పిందని పోలీసులు అన్నారు.
మరోవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్దకు మూడు వ్యాన్లు చేరుకున్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే అక్కడ స్వాతి మలివాల్ కనిపించలేదన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పోలీసులు సీఎం నివాసంలోకి ప్రవేశించలేరని చెప్పారు. అనంతరం స్వాతి మలివాల్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిందని, అయితే ఎలాంటి ఫిర్యాదు చేయకుండా వెంటనే తిరిగి వెళ్లిపోయినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. స్వాతి మలివాల్‌కు ఏం జరిగింది, పోలీసులకు రెండు ఫోన్ కాల్స్ చేసినప్పటికీ ఆమె ఎందుకు ఫిర్యాదు చేయలేదో అన్నది తమకు అర్థం కాలేదన్నారు.