గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే సాగాయి. కేవలం చివరిరోజే లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. లాభాల స్వీకరణకే మొగ్గు చూపారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,213.68 పాయింట్లు క్షీణించి 72,664.47 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 420.65 పాయింట్లు పడిపోయి 22,055.20 దగ్గర నిలిచింది. ఈ క్రమంలో ఈ వారం కూడా మదుపరులు అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కోవచ్చన్న అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా విడుతలవారీగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల సరళిని చూసి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు దైలమాలో పడ్డారని, పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై స్పష్టత కొరవడటమే కారణంగా వారు పేర్కొంటున్నారు. ఇందులోభాగంగానే గత వారం నష్టాలను దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. ఇక నిఫ్టీకి 21,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 21,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 22,300-22,500 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
SMARTగా ఆలోచించండి