శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Mar 18, 2020 , 23:34:09

‘పది’కి వేళాయె

‘పది’కి వేళాయె

  • నేటి నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు 
  • హాజరుకానున్న 14,319 మంది విద్యార్థులు 
  • జిల్లావ్యాప్తంగా 72 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు  
  • కేంద్రాల వద్ద అన్ని వసతులు, 144 సెక్షన్‌ అమలు 
  • ఎగ్జామ్స్‌ స్పెషల్‌ పేరుతో ఆర్టీసీ బస్సులు 
  • విద్యార్థులకు మంత్రి హరీశ్‌రావు ఆల్‌ ది బెస్ట్‌ 

సిద్దిపేట రూరల్‌ : నేటినుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లావ్యాప్తంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.  గురువారం ప్రారంభం కానున్న పరీక్షలు ఏప్రిల్‌ 6వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు గంట ముందుగానే కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలకు మొత్తం 14,319 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందు లో రెగ్యులర్‌ విద్యార్థులు 14,270 మంది విద్యార్థులు ఉండగా.. 49 మంది ప్రైవేట్‌ విద్యార్థులు ఉన్నారు.  1403 మంది ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికి మొత్తం 72 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందు లో 69 ప్రభుత్వ పాఠశాలలోని పరీక్ష కేంద్రాలు ఉండగా,  3 ప్రైవేటు విద్యా సంస్థల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 

పకడ్బందీ ఏర్పాట్లు..

పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు జిల్లాలో మొత్తం 20 స్టోరేజీ పాయింట్లు, 21 పోస్టాఫీస్‌లతోపాటు 40 మంది కస్టోడియన్లు, జాయింట్‌ కస్టోడియన్లను కేటాయించారు. అలాగే, 80 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 80 మంది డిపార్ట్‌మెంటల్‌, 8 మంది అడిషనల్‌ డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 5 మంది ఫ్లయింగ్‌ స్కాడ్స్‌, 9 మంది రూట్‌ ఆఫీసర్లు, 786 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.  పర్నిచర్‌, మంచినీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యార్థులను అరగంట ముందే పరీక్ష కేం ద్రంలోకి పంపిస్తామని, ఏవైనా ఇబ్బందులుంటే ఎంఈవో, డీఈవోను ఫోన్‌లో సంప్రదించాలన్నారు. విద్యార్థులు  ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నారు. 

 ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థినీ విద్యార్థులు మంత్రి హరీశ్‌రావు ఆల్‌ ది బెస్ట్‌ చె ప్పారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో రాయాలని, కష్టపడి చదివిన దాన్ని.. ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. మీ భవిష్యత్‌కు పదో తరగతి పునాది లాంటిదని, పరీక్షలు బాగా రాసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మంచి ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలన్నారు. రెండేండ్లలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలో 2, 3 స్థానాల్లో నిలిచిందని, ఈ సంవత్సరం మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. 3, 4 నెలలుగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు  ప్రత్యేక తరగతు లు నిర్వహించి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారని, పరీక్షలయ్యేంత వరకు అదే స్ఫూర్తితో ఉండాలని కోరారు.  

- ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుlogo