YouTube | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంపెనీ భారత దేశం మేనేజింగ్ డైరెక్టర్‌గా గుంజన్ సోనీని నియమించినట్లుగా సోమవారం వెల్లడించింది. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ-కామర్స్ రంగాల్లో రెండు దశాబ్దాలకుపైగా అనుభవం ఉన్న ఆమె భారత్‌లో యూట్యూబ్ వృద్ధి, ఆవిష్కరణ ప్రయత్నాలకు బాధ్యత వహించబోతున్నట్లుగా ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ సందర్భంగా యూట్యూబ్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ గౌతమ్ ఆనంద్ మాట్లాడుతూ.. భారత్‌లో యూట్యూబ్ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా సాగుతోందన్నారు.
అపారమైన సృజనాత్మకత, సామర్థ్యం ఉన్న దేశం భారత్ అన్న ఆయన.. అపారమైన అనుభవం ఉన్న గుంజన్‌కు స్వాగతం పలుకుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. క్రియేటర్ ఎకానమీ, భారతదేశ వీడియో కామర్స్ రంగంపై ఆమెకున్న లోతైన అవగాహన, నాయకత్వ పటిమతో క్రియేటర్ల వృద్ధిని వేగవంతం చేసేందుకు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం, వినియోగదారులను ఆకట్టుకునేందుకు, డిజిటల్ ఇండియా ప్రయాణానికి మరింత తోడ్పాటునందించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంజన్ సోనీ మాట్లాడుతూ.. యూట్యూబ్‌లో చేరడం గౌరవంగా భావిస్తున్నానని.. అదే సమయంలో ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా క్రియేటర్లను యూట్యూబ్ శక్తివంతం చేస్తున్న తీరు, కమ్యూనిటీలను కలుపుతున్న విధానం స్ఫూర్తిదాయకమని.. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ క్రియేటర్లకు కొత్త అవకాశాలను అందించడంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకునేలా యూట్యూబ్ పాత్రను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని గుంజన్ పేర్కొన్నారు.
ఆమె గతంలో సింగపూర్ కేంద్రంగా పని చేసిన జలోరాలో గుంజన్ గతంలో జలోరా, స్టార్ ఇండియా, మింత్రాలో సేవలందించారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసిన జలోరా (ZALORA) గ్రూప్‌కు ఆరేళ్లపాటు సీఈఓగా పని చేశారు. అక్కడ ఆమె కొత్త కేటగిరీలు, వ్యాపార నమూనాలను పరిచయం చేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు ఆమె స్టార్ ఇండియాలో ఈవీపీగా, మింత్రాలో సీఎంఓగానూ సేవలందించారు. పనిచేశారు. మెకిన్సీలో కన్స్యూమర్ అండ్ మార్కెటింగ్ విభాగంలో భాగస్వామిగా వ్యవహరించారు.