Google Search | స్మార్ట్‌ఫోన్ వచ్చాక అనుక్షణం ఇంటెర్నెట్ సేవలపై ఆధారపడుతున్నాం. ఫోన్ నంబర్లు మొదలుకొని వెళ్లాల్సిన చోటు వరకు బుర్రకు పదును తగ్గించి నెట్లోకి తొంగి చూస్తున్నాం. ఈ వెతికే క్రమంలో మనల్ని ఎవరు ఓ కంట కనిపెడుతున్నారో గమనించడం మర్చిపోతున్నాం. మన సెర్చులపై.. వెనకాల సైబర్ నేరగాళ్లు రీసెర్చ్ చేసేస్తున్నారన్న సంగతి గుర్తించడం లేదు. ఈ ఆదమరపే వాళ్లకు ఆదరువుగా మారుతున్నది. మనం ఏం వెతుకుతున్నది, ఏం కోరుకుంటున్నది, ఏం కొంటున్నది తెలుసుకొని అవకాశం చూసి గాలం విసురుతున్నారు. ఈ వెతుకులాటలో అరటిపండు కావొద్దంటే.. ఎంత సేఫ్‌గా బ్రౌజింగ్ చేస్తున్నామన్నది ముఖ్యం.
ఇంటర్నెట్ సేవలు విస్తృతం అయ్యాక వ్యక్తిగత సమాచారానికి రక్షణ కరువవుతున్నది. కావాల్సిన వస్తువు కోసం అమెజాన్‌లో వెతికిందే తడవుగా వివిధ బ్రాండ్ల ప్రకటనలు మన బ్రౌజర్‌పై ప్రత్యక్షం అవుతాయి. గూగుల్‌లో పర్సనల్ లోన్ ఈఎమ్ఐ కాలిక్యులేటర్ ఓపెన్ చేశామా.. మర్నాటి నుంచి లోన్ ఇస్తామంటూ ఫోన్లు వెల్లువెత్తుతాయి. సరైన బ్రౌజింగ్ విధానాలు పాటించకపోవడం వల్లే ఈ తిప్పలు! సేఫ్‌గా బ్రౌజింగ్ చేస్తే.. ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు.
సేఫ్ బ్రౌజర్స్ వాడకం వల్ల కుకీస్ వంటి థర్డ్‌పార్టీ టూల్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ బ్రౌజర్లు ప్రమాదకరమైన వెబ్‌లింక్స్ గురించి హెచ్చరిక చేస్తాయి. సెర్చింగ్ హిస్టరీ డిసేబుల్ చేసుకునే అవకాశమూ ఉంటుంది. బ్రౌజింగ్ యాక్టివిటీతోపాటు క్యాష్ మెమరీని తొలగించుకోవచ్చు. బ్రేవ్, డక్‌డక్ గో, టార్, మొజిలా, క్రోమ్ సేఫ్ బ్రౌజర్లుగా పేరున్నాయి.
గూగుల్‌లో ఏదైనా వెతకొచ్చు. కానీ, ఎలాగంటే అలా వెతకడం సరికాదు. సెర్చ్ వర్డ్ నేరుగా ఎంటర్ చేస్తే.. అవసరమైన సమాచారం కన్నా, పనికిరానిదే ఎక్కువగా ప్రత్యక్షమవుతుంది. అలా రావొద్దంటే.. డబుల్ కోట్స్‌లో ఆ పదాన్ని ఎంటర్ చేస్తే.. దానికి సంబంధించిన సమాచారం మాత్రమే కనిపిస్తుంది. జంటపదాలకు సంబంధించినవి వెతికేటప్పుడు మధ్యలో ‘-’ ఉపయోగిస్తే.. కచ్చితమైన సమాచారం లభిస్తుంది.
⌛ ఈ మెయిల్, వాట్సాప్, మెసేజ్‌లలో వచ్చే షార్ట్ యూఆర్ఎల్ లింక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు. ఆ యూఆర్ఎల్ సోర్స్ తెలుసుకోవడానికి www.isitphishing.org లింక్ ఉపయోగించండి.
⌛ సున్నితమైన అంశాలు, వ్యక్తిగత విషయాలను ఈ-మెయిల్ ద్వారా పంపొద్దు.
⌛ బాగా తెలిసినవారైనా డబ్బులు కోరుతూ ఈ మెయిల్ పంపినట్టయితే.. ముందుగా హెడర్ చెక్ చేయాలి. http://mxtoolbox.com/ Email Headers.aspx లింక్ ఓపెన్ చేసి, బాక్స్‌లో హెడర్‌ను పేస్ట్ చేస్తే ఆ మెయిల్ పంపిన అసలు చిరునామా తేటతెల్లం అవుతుంది.
⌛ బ్యాంకు, ఇతర సంస్థలకు చెందిన కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్‌లో సెర్చ్ చేయొద్దు. ఆయా వెబ్సైట్లకు వెళ్లి నంబర్ తీసుకోవాలి.
⌛ అనుమానిత వెబ్‌లింక్‌ల ద్వారా వచ్చే క్యూఆర్ కోడ్లను ఎప్పడూ స్కాన్ చేయకూడదు. ఓటీపీ, యూపీఐఎన్, క్రెడిట్‌కార్డు వివరాలు షేర్ చేయొద్దు.
⌛ మీ మెయిల్ ఐడీకి, సోషల్ మీడియా అకౌంట్లకు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెటప్ చేసుకోవడం మంచిది.
⌛ మీరు వాడుతున్న బ్రౌజర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. సెక్యూర్డ్ వెబ్సైట్లు మాత్రమే యాక్సెస్ అయ్యేలా చూసుకోవాలి. https:// తో మొదలయ్యే వెబ్సైట్లు మాత్రమే సెక్యూర్డ్ అని గుర్తుంచుకోవాలి.
⌛ ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఇన్‌కాగ్నిటో మోడ్ ఎంచుకుంటే మంచిది. దీనివల్ల మీ బ్రౌజింగ్ యాక్టివిటీ ఇతరులు తెలుసుకునే అవకాశం ఉండదు.
⌛ ఒక్కో ఆపరేషన్‌కు ఒక్కో బ్రౌజర్‌ను ఉపయోగించడం మంచిది. ఉదాహరణకు వెబ్ బ్రౌజింగ్ కోసం ఒకటి, బ్యాంకింగ్ సేవల కోసం మరో బ్రౌజర్, సోషల్ అకౌంట్స్ కోసం ఇంకో బ్రౌజర్ ఎంచుకోవడం ఉత్తమం. ఆయా బ్రౌజర్లలో మీ అవసరాలకు అనుగుణంగా ప్రైవసీ సెట్టింగ్‌లు చేసుకోవాలి.
⌛ పని పూర్తయిన తర్వాత సోషల్ మీడియా, ఈమెయిల్ అకౌంట్ నుంచి లాగ్ అవుట్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీటన్నిటితోపాటు లైసెన్స్డ్ యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకోవాలి.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?
అందమైన అమ్మాయిల నుంచి రిక్వెస్ట్‌లు వస్తున్నాయా?
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? కాపురాలే కూలిపోవచ్చు జాగ్రత్త
మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా? జాగ్రత్త పడండి
సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమో.. కాదో ఎలా తెలుసుకోవాలి?
5G Scam Alert | 5జీ అప్‌గ్రేడ్ చేసుకోమని కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త