Recession Layoffs | ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకువస్తుందన్న భయాలు టెక్ సంస్థలకు, టెక్ నిపుణులకు కంటి మీద లేకుండా చేస్తున్నాయి. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ప్రతి రోజూ 1600 మంది ఉద్యోగులకు `పింక్ స్లిప్`లు ఇచ్చి ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ నెలలో 15 రోజుల్లో సుమారు 91 కంపెనీలు 24 వేల మందికి పైగా టెక్ నిపుణులను తొలగించేశాయి. మున్ముందు సాఫ్ట్వేర్ నిపుణుల తొలగింపు మరింత పెరుగుతుందని లేఆఫ్స్.ఫై అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
గతేడాది వెయ్యికి పైగా కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించేశాయి. వాటిల్లో మెటా, అమెజాన్, అలీబాబా, ట్విట్టర్, బెటర్ డాట్ కామ్ వంటి పలు అతిపెద్ద టెక్ సంస్థలు ఉన్నాయి. ఇండియా టెక్ సంస్థల్లో పని చేస్తున్న ఐటీ నిపుణుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రత్యేకించి దేశంలోని స్టార్టప్ సంస్థలు పొదుపు చర్యల్లో భాగంగా తమ సిబ్బందిని పంపేస్తున్నాయి.
సోషల్ మీడియా సంస్థ `షేర్‌చాట్` ప్రస్తుత అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లో 20 శాతం సిబ్బందిని.. 500 మందికి పైగా సాగనంపింది. ట్విట్టర్, గూగుల్, స్నాప్, టైగర్ గ్లోబల్ సంస్థలు షేర్‌చాట్‌లో పెట్టుబడులు పెట్టాయి. ఈ సంస్థలో 2,300 మంది పని చేస్తున్నారు. ఇంతకుముందే జీత్11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను మూసేసింది షేర్‌చాట్. గత నెలలో ఐదు శాతం మందికి ఉద్వాసన పలికింది.
క్యాబ్ సర్వీసుల అగ్రిగేటర్ `ఓలా`.. 200 మందిని, వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్ డాట్ ఏఐ కూడా సిబ్బందికి ఉద్వాసన పలికిన సంస్థల్లో ఉన్నాయి. దేశీయంగా అభివృద్ధి చెందిన క్విక్ గ్రాసరీ డెలివరీ ప్రొవైడర్ డుంజో పొదుపు చర్యల్లో భాగంగా మూడు శాతం మందిని తొలగించేసింది. ఇక గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్.. భారత్‌లో దాదాపు వెయ్యి మందితోపాటు ప్రపంచవ్యాప్తంగా 18 వేల మందిని తొలగిస్తామని ఇంతకుముందే ప్రకటించింది.