Aditya-L1 | చంద్రయాన్-3 విజయవంతంతో దూకుడుమీదున్న ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. మిషన్‌లో భాగంగా శనివారం పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్‌ను విశ్వంలోకి మోసుకెళ్లనున్నది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను ఇస్రో లాగ్రాంజియన్ పాయింట్ -1లో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నది. భూమికి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కక్ష్యను చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పట్టనున్నది. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మరోసారి ఇస్రోపైనే ఉన్నది. అయితే, సూర్యుడిపై ఇంతకు ముందు పలు దేశాలు ప్రయోగాలు చేపట్టాయి. అయితే, వీటికి భిన్నంగా ఆదిత్య ఎల్-1 మిషన్‌తో ఇస్రో భిన్నంగా ఎలాంటి పరిశోధనలు చేయబోతున్నదో తెలుసుకుందాం..!
ఆదిత్య ఎల్-1 మిషన్‌లో భాగంగా ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేయనున్నది. ఇస్రో ఈ మిషన్‌ను తొలి స్పేస్ బేస్డ్ కేటగిరి ఇండియన్ సోలార్ మిషన్ అని తెలిపింది. స్పేస్ వెహికిల్‌ను భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని సూర్యుడు-భూమి మధ్య లాగ్రాంజియన్ పాయింట్ 1 (L1) హాలో కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది. ఆదిత్య ఎల్-1 సూర్యుడి కరోనా నిర్మాణం, సౌర విస్ఫోటనాలు, సౌర తుఫానులకు కారణాలతో పాటు మూలాలు, కరోనా, కరోనల్ లూప్ ప్లాస్మా నిర్మాణంతో పాటు సాంద్రత, లక్షణాలతో పాటు పలు అంశాలపై పరిశోధనలు జరుపనున్నది.
అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆగస్ట్ 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్‌ను పంపింది. డిసెంబర్ 2021లో పార్కర్ సూర్యుడి ఎగువ వాతావరణంలో ఎగురుతూ.. కరోనాతో పాటు అయస్కాంత క్షేత్రాలపై పరిశోధనలు జరుపుతున్నది. స్పేస్ షటిల్ సూర్యుడికి దగ్గరగా వెళ్లడం ఇదే తొలిసారి అని నాసా తెలిపింది. సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన వేడి, రేడియేషన్లను తట్టుకుని పార్కర్ సూర్యుడి గమనం, పనితీరు గురించి మరిన్ని కొత్త కోణాలను సేకరించింది. సూర్యుడి చుట్టూ ఉండే వలయాన్ని కరోనాగా పిలుస్తుండగా.. పార్కర్ సోలార్ ప్రోబ్ అనే అంతరిక్ష నౌక కరోనాలోంచి కొద్దిసేపు ప్రయాణించింది. అలాగే, 2020లో నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి మారుతున్న అంతరిక్ష వాతావరణంపై అన్వేషించేందుకు సోలార్ ఆర్బిటర్‌ను ప్రారంభించింది. సోలార్ ఆర్బిటర్, అంతర్గత హీలియోస్పియర్, పుట్టుకతో వచ్చే సోలార్ విండ్స్, సూర్యుడి ధ్రువ ప్రాంతాలపై పరిశోధనలు చేపట్టేందుకు మిషన్‌ను ప్రారంభించింది.
జపాన్‌కు చెందిన జక్సా (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) 1981లో తొలి సౌర పరిశీలన ఉపగ్రహం హినోటోరి (Hinotori ASTRO-A) మిషన్‌ను ప్రారంభించింది. హార్డ్ ఎక్స్-కిరణాలను ఉపయోగించి సోలార్ ఫ్లేమ్స్‌పై అధ్యయనం చేయడం దీని లక్ష్యం. ఆ తర్వాత 1991లో Yohkoh (SOLAR-A). 1995లో నాసా, ఈసా, సమన్వయంతో SOHO, 1998లో నాసాతో కలిసి ట్రాన్సియెంట్ రీజియన్, కరోనల్ ఎక్స్‌ప్లోరర్ (TRACE), 2006లో హినోడ్ (సోలార్-బీ)ను జపాన్ ప్రయోగించింది. అమెరికా, యూకే సహకారంతో జపాన్ మిషన్ చేపట్టింది. ఇది భూమిపై చంద్రుడి ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది.
యూరప్ 1990 అక్టోబర్‌లో యూరప్ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ) సూర్యుడి ఎగువన, దిగువన ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి యులిసెస్ మిషన్‌ను మొదలు పెట్టింది. నాసా, జాక్సా సహకారంతో ఈసా 2021లో ప్రోబా-2 ప్రయోగం చేపట్టింది. ఇది విజయంతమైన ప్రోబా-1 సిరీస్‌కు కొనసాగింపు.. ప్రోబా-2లో నాలుగు ప్రయోగాలు కొనసాగుతుండగా.. సూర్యుడికి రెండు సంబంధించినవే. ప్రోబా పూర్తి పేరు ప్రాజెక్ట్ ఫర్ ఆన్-బోర్డ్ అటానమీ. యూరప్ ప్రయోగించే రాబోయే సౌర మిషన్లలో 2024లో ప్రోబా-3, 2025లో స్మైల్ మిషన్లు ఉన్నాయి.
చైనా 2022 అక్టోబర్ 8న అడ్వాన్స్డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీని (ASO-S) నేషనల్ స్పేస్ సైన్స్ సెంటర్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (CAS) ప్రారంభించింది. ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్1 ప్రయోగం ద్వారా సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న ఆయాదేశాల సరసన భారత్ నిలువన్నది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సూర్యుడిపై ప్రయోగాలు చేపట్టిన దేశాలకు భిన్నంగా ఇస్రో ఎల్-1 పాయింట్లో శాటిలైట్‌ను ఉంచబోతున్నది. అక్కడి నుంచి సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులు తదితర అంశాలను మిషన్ ద్వారా తెలుసుకోవాలని భావిస్తున్నారు.
ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపడుతుండగా.. భూమి మధ్య దూరం 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రవేశపెట్టనున్నది. ఆదిత్య శాటిలైట్‌ను నేరుగా సూర్యుడి దగ్గరగా పంపరు.. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేర్చనున్నారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరనుండగా.. గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేయనున్నది.