Samsung Galaxy Book5 | శాంసంగ్ సంస్థ అదిరిపోయే ఏఐ ఫీచర్లతో ఓ నూతన ల్యాప్‌టాప్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గెలాక్సీ బుక్ 5 పేరిట ఈ ల్యాప్టాను ప్రవేశపెట్టింది. ఆకట్టుకునే ఏఐ ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్‌లో అందిస్తున్నారు. అత్యంత స్లిమ్‌గా ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. కనుక దీనికి ప్రీమియం లుక్ వచ్చింది. అలాగే చాలా తేలికగా అనిపించే డిజైన్‌ను ఈ ల్యాప్‌టాప్ కలిగి ఉంటుంది. గెలాక్సీ బుక్ 5 ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచుల యాంటీ గ్లేర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ లభిస్తుంది. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 61.2 వాట్ అవర్ బ్యాటరీ ఉంది. దీని వల్ల ల్యాప్‌టాప్‌లో 19 గంటల పాటు నాన్ స్టాప్‌గా వీడియోలను వీక్షించవచ్చని కంపెనీ చెబుతోంది.
ఈ ల్యాప్‌టాప్‌ను 4 వేరియెంట్లలో లాంచ్ చేశారు. ఇంటెల్ కోర్ అల్ట్రా 5, ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్లను ఈ వేరియెంట్లలో అందిస్తున్నారు. ఇవి చాలా హైస్పీడ్ పెర్ఫార్మెన్స్ను అందిస్తాయి. అందువల్ల ఈ ల్యాప్‌టాప్‌లలో చాలా వేగంగా, సులభంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. గతంలో వచ్చిన గెలాక్సీ బుక్ 4 కన్నా ఈ ల్యాప్‌టాప్ 38 శాతం ఎక్కువ సీపీయూ, గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ల్యాప్‌టాప్‌లో పలు అద్భుతమైన ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఏఐ ఫొటో రీమాస్టర్, ఏఐ సెలెక్ట్, సర్కిల్ టు సెర్చ్, కోపైలట్ విత్ హాట్ కీ, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్ వంటి ఏఐ ఫీచర్లను ఇందులో పొందవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌కు గాను ప్రత్యేకంగా గెలాక్సీ కనెక్టెడ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ల్యాప్ టాప్‌లో మల్టీ కంట్రోల్, సెకండ్ స్క్రీన్, క్విక్ షేర్ వంటి ఫీచర్లను సులభంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లో డిఫాల్ట్‌గా ఇంటెల్ గ్రాఫిక్స్‌ను అందిస్తున్నారు. ఇంటెల్ ఏఐ బూస్ట్ టెక్నాలజీ ఉండడం వల్ల ఏఐ ఫీచర్లు మెరుగ్గా పనిచేస్తాయి. 16జీబీ, 32జీబీ ర్యామ్, 512జీబీ, 1టీబీ ఎస్ఎస్డీ ఆప్షన్లలో ఈ ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేశారు. ఈ ల్యాప్‌టాప్‌లకు 45 వాట్ల యూఎస్బీ టైప్ సి అడాప్టర్ లభిస్తుంది. కనుక ల్యాప్‌టాప్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. డాల్బీ అట్మోస్ ఫీచర్‌ను అందిస్తున్నారు కనుక సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. 1080పి ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ వెబ్ కెమెరా కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.2 లభిస్తున్నాయి. హెచ్డీఎంఐ, యూఎస్బీ టైప్ సి, మైక్రో ఎస్డీ రీడర్ వంటి అదనపు సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ స్లాట్‌ను, ఫింగర్ ప్రింట్ రీడర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాప్‌టాప్ కేవలం 1.55 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. అందువల్ల దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
ఈ ల్యాప్‌టాప్‌లో గెలాక్సీ బుక్ ఎక్స్‌పీరియెన్స్ సూట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల పలు ఏఐ ఫీచర్లను చాలా సులభంగా వాడుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ బుక్ 5 ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.77,990గా ఉంది. కేవలం గ్రే కలర్ ఆప్షన్లో మాత్రమే ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేశారు. ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై రూ.10వేల క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నారు. 24 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఎంపిక చేసిన ఆథరైజ్డ్ రిటెయిల్ స్టోర్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను విక్రయిస్తున్నారు.