బొంబాయి రవ్వ: ముప్పావు కిలో
పెరుగు: ముప్పావు కప్పు
ఈనో ప్యాకెట్: ఒకటి
అల్లం: అంగుళం
పచ్చిమిర్చి: నాలుగైదు
పంచదార: రెండు టీ స్పూన్లు
నూనె: టేబుల్ స్పూను
ఆవాలు: స్పూను
ఇంగువ: రవ్వంత
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ఉప్పు: తగినంత
బొంబాయి రవ్వను సన్నగా మిక్సీ పట్టుకోవాలి. దాన్ని గిన్నెలో వేసుకుని పెరుగు కలిపి పక్కకు పెట్టి, కనీసం అరగంట సేపు వదిలేయాలి. తర్వాత అల్లం, రెండు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి ఇందులో కలపాలి. ఉప్పు, నూనె, పంచదార కూడా వేసి ఇడ్లీ పిండి తరహాలో చేసుకోవాలి. అవసరమైతే ఇందులో కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. పొయ్యి మీద కడాయి పెట్టి నీళ్లు పోసి మరగనివ్వాలి. కడాయిలో చిన్న స్టాండు పెట్టుకోవాలి. ఈనోను పిండిలో కలుపుకోవాలి. గరిటెను సవ్య దిశలో తిప్పుకోవాలి. స్టాండు మీద నూనె రాసిన గిన్నెపెట్టి ఈ పిండిని అందులో పోసి మూత పెట్టాలి. అంటే ఇది నీళ్ల ఆవిరి మీద ఉడుకుతుంది.
ఇది తయారవడానికి సుమారు అరగంట పడుతుంది. ఉడికిన తర్వాత దింపేసి చల్లారాక నాలుగు పలకలుగా ముక్కలు కోసి ఒక బేసిన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద చిన్న మూకుడు పెట్టి నూనె వేసి కాగాక ఆవాలను చిటపటలాడించాలి. రెండు మూడు పచ్చిమిరపకాయలను చీల్చి మూకుట్లో వేసి, ఇంగువ కూడా జోడించి సువాసన రాగానే అరగ్లాసు నీళ్లు పోసి చక్కెర వేసి కరిగేదాకా కలపాలి. ఇప్పుడు దీన్ని ముక్కల మీద చల్లి అన్నింటినీ బాగా కలపాలి. చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లితే మృదువుగా బోలుగా ఉండే రవ్వ ఢోక్లా సిద్ధమైపోతుంది.