తురాయి చెట్టు పూలు అంత సాధారణంగా అందవు. కొమ్మల శిఖరాగ్రాన పూయడం వీటి ప్రత్యేకత. అందని ఆ వర్ణాలను చిత్రించడం చిత్రకారుల లక్ష్యం. ఆ అగ్గిపూల అందాలను పదాల్లో పొదగడం కవులకెంతో ఇష్టం. ‘తురాయి’ అంటే మకుటం. విలువైన అందమైన భాగాన్ని వర్ణిస్తున్నప్పుడు కవులు ఈ పదం ప్రయోగిస్తారు. కవులు, రచయితలకు గుల్మొహర్ ఒక వస్తువు. ఈ పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది! తురాయి చెట్టునే గుల్మొహర్ అంటారు. ఊళ్లల్లో ‘కోడిపుంజు చెట్టు’ అని కూడా పిలుస్తారు. ఏదైనా ఊరికి ప్రయాణం కట్టామంటే ఈ చెట్టుని చూడకుండా అనుకున్నచోటికి పోలేం. కలవాలనుకున్న వాళ్లను కలవలేం. అసలు ఈ చెట్టు లేని రోడ్డే లేదు! రాష్ట్రంలోని ప్రధాన రహదారుల పక్కన ఈ చెట్లను ప్రభుత్వం విరివిగా నాటింది.
తురాయి ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే చెట్టు. అలంకారం కోసం ఈ చెట్టుని పెంచుకుంటారు. ఇంటికి, వీధికే కాదు సమస్త ప్రకృతికీ ఇది వన్నె తెస్తుంది. ఎరుపు, పసుపు రంగు పూలతో పచ్చని గుబురులతో తురాయి చెట్టు కనువిందు చేస్తుంది. ప్రకృతి చిత్రకారుల (ల్యాండ్‌స్కేప్ పెయింటర్స్)ను ఈ పూలు ప్రభావితం చేస్తాయి. నేను ప్రతి సంవత్సరం ఒక గుల్మొహర్ చెట్టుని చిత్రిస్తాను.
ఈ చెట్టు కొమ్మలు వేగంగా పెరుగుతూ పక్కలకు విస్తరిస్తాయి. అందువల్ల గొడుగులాంటి ఆకారంలో ఇది కనిపిస్తుంది. దీని కాయలు మూరెడు పొడవు ఉంటాయి. ఆకుపచ్చ రంగులోని కాయలు ఎండిన తర్వాత కాఫీ రంగులోకి మారతాయి. దీని గింజలు క్యాప్సూల్ (జబ్బులు తగ్గడానికి వేసుకునే మందుగోలీ) ఆకారంలో ఉంటాయి. ఆకుల అమరిక ఫెర్న్ని పోలి ఉంటుంది. ఆకులు విశాలంగా పరచుకుంటాయి. అందువల్ల బాటసారులకు మంచి నీడనిస్తుంది. చిన్న తురాయి అని మరో రకం చెట్టు ఉంది. రోడ్డుకి ఇరువైపులా పచ్చదనం కోసం, నగర సుందరీకరణ కోసం దీనిని నాటతారు. ‘స్నేక్ ఫ్రూట్’ పురుగు నివారణకు వాడే ద్రావణం తయారీకి చిన్న తురాయి ఆకుల రసం ఉపయోగిస్తారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు