Jio Bharat 4G Feature Phone | టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో నూతన 4జి ఫీచర్ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ఈ ఫోన్‌ను జియో విడుదల చేసింది. జియో భారత్ పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. సేఫ్టీ ఫస్ట్ అనే నినాదంతో ఈ ఫోన్‌ను లాంచ్ చేసినట్లు జియో తెలియజేసింది. కుటుంబ సభ్యుల మధ్య సురక్షితమైన కమ్యూనికేషన్ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. దీని వల్ల ఎంతో మందికి ఫోన్ సదుపాయం చాలా తక్కువ ధరకే లభిస్తుందని, తక్కువ ధరకే 4జి సేవలను ఉపయోగించుకునే సదుపాయం ఉంటుందని జియో చెబుతోంది. జియో భారత్ ఫోస్ వల్ల కుటుంబాలు తమ పిల్లలకు, వృద్ధులైన తల్లిదండ్రులకు, ఒంటరిగా జీవిస్తున్న వారికి దగ్గరగా ఉండవచ్చని జియో తెలియజేసింది. అందుకనే ఈ ఫోన్లకు గాను సేఫ్టీ షీల్డ్ అనే సదుపాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఈ ఫోన్ సహాయంతో వ్యక్తులు తమకు ఇష్టమైన వారి లొకేషన్‌ను ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో ట్రాక్ చేసేందుకు వీలుగా ఉంటుంది. సంరక్షకులు ఈ ఫోన్‌కు గాను సెట్టింగ్స్‌ను ఫిక్స్ చేయవచ్చు. ఎవరు కాల్ లేదా మెసేజ్ చేయాలని ముందే కంట్రోల్ చేయవచ్చు. అలాగే తెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లను బ్లాక్ చేయవచ్చు. ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ లెవల్స్, నెట్వర్క్ సిగ్నల్ సామర్థ్యం వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అందువల్ల బ్యాటరీ అయిపోతుందనే బెంగ ఉండదు. ఈ ఫోన్‌ను చిన్నారులకు కూడా ఉపయోగించవచ్చని, దీని వల్ల వారు సోషల్ మీడియాను ఉపయోగించే సమయం తగ్గుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే కాల్స్, లొకేషన్‌ను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. వృద్ధులకు అయితే లొకేషన్, హెల్త్ అప్డేట్స్ను తెలుసుకోవచ్చు. మహిళలు సేఫ్టీని, అత్యుత్తమ కనెక్టివిటీని పొందవచ్చని జియో తెలియజేసింది.
కాగా జియో భారత్ ఫోన్‌ను ప్రతి కుటుంబానికి సేఫ్టీ, సౌకర్యం, ప్రశాంతత లభించేలా రూపొందించామని కంపెనీ చెబుతోంది. దీని వల్ల మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా టెక్నాలజీ సులభంగా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక జియో భారత్ సేఫ్టీ ఫస్ట్ ఫోన్ ధర రూ.799 ఉండగా, ఈ ఫోన్‌ను జియో స్టోర్స్, అన్ని ప్రధాన మొబైల్ రిటెయిల్ స్టోర్స్, జియో మార్ట్, అమెజాన్, స్విగ్గీ ఇన్ స్టామార్ట్ వంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లను జియో వెల్లడించలేదు. కానీ ఈ ఫోన్‌ను ఇతర ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ డివైస్‌లకు కనెక్ట్ చేసుకుని ఉపయోగించవచ్చు. అందుకు గాను జియో థింగ్స్ యాప్‌ను ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ప్రస్తుతానికి బ్లూ కలర్ వేరియెంట్‌లోనే లాంచ్ చేశారు. దీని గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
ఈ ఫోన్‌ను లాంచ్ చేసిన సందర్భంగా రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ మాట్లాడుతూ ప్రతి భారతీయుడిని కనెక్ట్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫోన్‌ను రూపొందించామని తెలిపారు. ఈ ఫోన్ టెక్నాలజీని అందిస్తూనే పౌరులను రక్షిస్తుందని, వారి అభివృద్ధికి సహాయ పడుతుందని తెలిపారు. సేఫ్టీ ఫస్ట్ అనే నినాదంతో ఈ ఫోన్‌ను రూపొందించామని అన్నారు. ఇది కేవలం ఫీచర్ ఫోన్ మాత్రమే కాదని, ఎన్నో కుటుంబాలకు కమ్యూనికేషన్, టెక్నాలజీ పరంగా సేఫ్టీని, ప్రశాంతతను అందిస్తుందని తెలిపారు. ఈ ఫోన్ ప్రతి భారతీయుడికి పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని కలిగిస్తుందని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ధరకే ఈ ఫోన్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ఎన్నో కోట్ల మందికి మేలు జరుగుతుందన్నారు. పౌరుల జీవనం మరింత సులభతరం అవుతుందన్నారు.