శనివారం 24 అక్టోబర్ 2020
Science-technology - Sep 27, 2020 , 18:43:32

ప్రపంచానికి మోదీ టీకా ఆఫర్‌ గర్వకారణం: అదార్ పూనావాలా

ప్రపంచానికి మోదీ టీకా ఆఫర్‌ గర్వకారణం: అదార్ పూనావాలా

టీకా కొనడానికి, పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి రూ.80 వేల కోట్లు లభిస్తాయా? అని అడిగిన మరుసటి రోజే.. ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసల్లో ముంచెత్తారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్ఐ‌ఐ) సీఈవో ఆదార్‌ పూనావాలా. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై ట్విట్టర్‌ వేదికగా ఆయన ప్రశంసించారు. "ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించడంపై మోదీ దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నాం. ఇది భారతదేశానికి గర్వకారణం. మీ నాయకత్వం, మద్దతుకు ధన్యవాదాలు. భారతదేశం కోసం మీ ఏర్పాట్లన్నీ భారత ప్రజల అవసరాలను తీర్చగలవని స్పష్టమవుతున్నది" అని అదార్ పూనావాలా ట్వీట్ చేశారు.

"ప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశంగా ఈ రోజు ప్రపంచ సమాజానికి మరో భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మానవాళి అందరికీ సహాయపడటానికి భారతదేశ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ సామర్థ్యం ఉపయోగించబడుతుంది. భారతదేశంలో దశ 3 క్లినికల్ ట్రయల్స్‌తో ముందుకు సాగుతున్నది. వ్యాక్సిన్ల పంపిణీ కోసం కోల్డ్ చైన్, నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో అన్ని దేశాలకు భారతదేశం సహాయం చేస్తుంది”అని ఐక్యరాజ్య సమితి సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు.

సీరం ఇన్‌స్టిట్యూట్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ల తయారీదారు. ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా పీఎల్సి, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ యొక్క 3 వ దశ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నది. వీటిలో పుణె ఆధారిత సంస్థ బిలియన్ మోతాదులను తయారుచేయాలని యోచిస్తున్నది. సీరం కాకుండా జైడస్ కాడిలా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అనే మరో రెండు కంపెనీలు 2 వ దశలో మానవ పరీక్షలను నిర్వహిస్తున్నాయి.logo