న్యూఢిల్లీ : 5జీ స్పెక్ట్రం వేలానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడంతో దేశంలో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారత్‌లో ప్రస్తుత 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ యూజర్లు 10 రెట్లు అధికమైన వేగం, సామర్ధ్యంతో కూడిన సేవలు పొందుతారని ప్రభుత్వం పేర్కొంది. 5జీ స్పెక్ట్రం వేలానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక టెలికమ్యూనికేషన్స్ శాఖ నోటీస్ ఇన్వైటింగ్ అప్లికేషన్ (ఎన్ఐఏ) ప్రక్రియను ప్రారంభింస్తుంది.
ఒకసారి నోటీసు జారీ చేస్తే కొద్దివారాల్లోనే వేలం ప్రక్రియ ఆరంభమవుతుంది. 5జీ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేకున్నా ఈ ఏడాదే అవి యూజర్లకు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్ధితి ప్రకారం సెప్టెంబర్‌లో 5జీ వాణిజ్య సేవలు ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. ప్రాధమిక దశలోనే దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ 5జీ అందుబాటులో ఉండదు.
లేటెస్ట్ నెట్వర్క్ దేశం నలుమూలలకూ విస్తరించేందుకు కొద్ది నెలల సమయం పడుతుంది. దేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 4జీ నెట్వర్క్ అందుబాటులో లేని పరిస్ధితి. ఇక 5జీ సేవలు తొలుత భారత్‌లోని 14 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూర్, చండీఘఢ్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రాం, జామ్‌నగర్, పుణే, లక్నో, ముంబై, కోల్‌కతా నగరాల్లో ముందుగా 5జీ సేవలు లభిస్తాయి.