న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా దీని లాభనష్టాలపై కూడా వాదవివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏఐ కొత్తపుంతలు తొక్కే కొద్ది మానవాళికి విఘాతమని ట్విట్టర్, టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సహా పలువురు టాప్ టెక్నాలజీ సీఈవోలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా లేటెస్ట్ సర్వే సైతం ఏఐ టూల్స్‌పై బాంబు పేల్చింది. యేల్ సీఈవో సమ్మిట్‌లో నిర్వహించిన సర్వేలో 42 శాతం మంది సీఈవోలు రానున్న కొన్నేండ్లలో ఏఐ మానవాళి విధ్వంసానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మరో ఐదు నుంచి పదేండ్లలో మానవాళికి ఇది పెను ముప్పుగా మారుతుందని ప్రముఖ బిజినెస్ టైకూన్లు అభిప్రాయపడ్డారు. వాల్‌మార్ట్, కోకాకోలా, జిరాక్స్, జూమ్ వంటి పలు ప్రముఖ కంపెనీల సీఈవోలు 119 మంది వరకూ ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఏఐ ప్రభావం అత్యంత ప్రమాదకరమని, ఆందోళన రేకెత్తిస్తుందని యేల్ ప్రొఫెసర్ జెఫ్రీ సొనెన్ఫెల్డ్ పేర్కొన్నారు. రాబోయే పదేండ్లలో ఏఐ మానవాళిని నాశనం చేస్తుందని 34 శాతం మంది సీఈవోలు పేర్కొనగా, ఇప్పటినుంచి ఐదేండ్లలోనే న్యూ టెక్నాలజీతో విధ్వంసం జరుగుతుందని 8 శాతం మంది చెప్పారు.
అయితే ఏఐ ఎన్నటికీ మానవులను అధిగమించదని, దాని పర్యవసానాలపై కలత చెందాల్సిన అవసరం లేదని 58 శాతం మంది సీఈవోలు చెప్పడం కొంత ఊరట కలిగిస్తోంది. ఏఐతో ముప్పు తప్పదని టెక్ దిగ్గజం ఎలన్ మస్క్‌తో పాటు చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ఏఐ అధిపతి సామ్ అల్ట్మన్ సహా పలువురు హెచ్చరించడంతో పాటు ఏఐపై నియంత్రణ ఉండాలని నొక్కిచెప్పిన నేపధ్యంలో తాజాగా సీఈవోలు సైతం న్యూ టెక్నాలజీ పర్యవసానాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :