Dude Review | యూత్ అభిరుచులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. వాళ్ల పల్స్ అందరికీ అందదు. అయితే ఈ విషయంలో ఒక కొత్త ఫార్ములాతో వచ్చాడు ప్రదీప్ రంగనాథన్. యూత్ కి నచ్చేలా లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు ‘డ్యూడ్’ ప్రమోషనల్ కంటెంట్‌లో కూడా అదే వైబ్ కనిపించింది. పైగా మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈసారి అంచనాలు కూడా పెరిగాయి. మరి ప్రదీప్ హిట్ ఫార్ములా మరోసారి వర్క్ అయ్యిందా..? తన ఖాతాలో హ్యాట్రిక్ పడిందా..?
కథ:
గగన్ (ప్రదీప్ రంగనాథ్) కుందన (మమిత బైజు) బావమరదళ్లు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లా పెరుగుతారు. కాలేజ్ డేస్ తర్వాత గగన్ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది కుందన. అయితే తనపై లవ్ లాంటి ఫీలింగ్ లేదని ఫ్రెండ్ గానే చూశానని చెప్తాడు గగన్. కుందన చాలా బాధపడుతుంది. కుందన దూరమైన తర్వాత గగన్ కి తనపై లవ్ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. మేనమామ కూతురే కావడంతో ఇంట్లో పెళ్లికి కూడా ఏర్పాట్లు చేసేస్తారు. సడన్ గా కుందన, గగన్ కి ఓ షాకింగ్ మేటర్ చెబుతుంది. ఏమిటా మేటర్? ఈ జంట ఒక్కటైయిందా? కుందన జీవితంలోకి వచ్చిన ఓ కొత్త వ్యక్తి కారణంగా ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ :
యూత్ ఫుల్ కోటింగ్ వేసిన ‘పరువు హత్య’ జానర్ కథ ఇది. ఈ కథకు స్ఫూర్తి ఆర్య 2 సినిమా అని స్వయంగా దర్శకుడు కీర్తి ఈశ్వరన్ చెప్పాడు. నువ్వే కావాలి లాంటి ప్రేమకథకి పరువు హత్య అనే కాన్సెప్ట్ జోడించి ఆర్య 2 ట్రాక్‌ని ఫిట్ చేస్తే తయారైన కథ ఇది. గగన్ పెళ్లి మండపంలో చేసే అల్లరితో కథ మొదలౌతుంది. గగన్ కుందన కెమిస్ట్రీ, శరత్ కుమార్ ట్రాక్, కొన్ని యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో బిగినింగ్ లో సరదాగానే సాగుతుంది. ఎప్పుడైతే పరువు, హత్య కోణం తెరపైకి వస్తుందో.. ఈ యూత్ ఫుల్ కంటెంట్ కన్ఫ్యుజన్ లో పడుతుంది. అటు కామెడీకి ఫిట్ కాక ఇటు సీరియస్ నెస్ లేకుండా ఒక డైలమాలోకి చేరుతుంది.
ఇందులో రెండు ప్రేమకథలు వున్నాయి. గగన్, కుందన పాత్రల్లో వుండే కెమిస్ట్రీ మరో ప్రేమకథలో కనిపించదు. దీంతో ఆ ట్రాక్ అంతా బహీనంగా మారుతుంది. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎమోషనల్ ఎడింగ్ ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ భావోద్వేగాలకు సరైన అవకాశం దొరకలేదు. దీనికి కారణం కూడా ఈ రెండు ప్రేమకథలని సరిగ్గా డీల్ చేయలేదు. అటు హానర్ కిల్లింగ్ పాయింట్ కూడా ఎలివేట్ కాలేదు. చివర్లో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అయితే అది కేవలం డైలాగ్ కి పరిమితమైనట్లు కనిపించింది. దానికి సన్నివేశ బలం దొరికుంటే సినిమా ఇంకా బెటర్ గా మెరుగ్గా వుండేది.
నటీనటులు నటన:
గనన్ పాత్రలో ప్రదీప్ ఒదిగిపోయాడు. తన ఎనర్జీ ఈ సినిమాకి ప్లస్. మమిత కూడా ఆకట్టుకుంది. నిజానికి మంచి జోడి ఇది. వీరి మధ్య ప్రేమకథకి పెద్ద పీటవేసుకుంటే బావుండేది. పార్ధు పాత్రలో కనిపించిన నటుడికి కథలో భాగం వుంది కానీ నటనలో లేదు. శరత్ కుమార్ పాత్ర హైలెట్. ఈ కథని కొత్త మలుపు తిప్పిన పాత్ర ఆయనది. రోహిణీ సహజంగా కనిపించింది. మిగతా నటులు పరిధిమేర కనిపించారు.
టెక్నికల్ గా:
సాయి అభ్యంకర్ సంగీతం తాజా ఫీల్ అందించేలా సాగుతుంది. బూమ్ బూమ్ పాటని వాడుకుతున్న తీరు బావుంది. నేపధ్య సంగీతం ఎనర్జిటిక్ గా చేశాడు. నికేత్ బొమ్మి కెమరా వర్క్ రిచ్ గా వుంది. ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్ అన్ని డిపార్ట్మెంట్స్ లో మైత్రీ మూవీ మేకర్స్ క్యాలిటీ కనిపించింది.
ప్లస్ పాయింట్స్..
ప్రదీప్, మమిత నటన
కొన్ని మూమెంట్స్
నేపధ్య సంగీతం, ప్రొడక్షన్ క్యాలిటీ
మైనస్ పాయింట్స్ ..
ప్రేమకథల్లో బలం లేకపోవడం
ఎమోషనల్ కనెక్షన్ మిస్ కావడం
రేటింగ్: 2.75/ 5
Read Also :
Rahul Sankrityan | వీడి14లో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు : రాహుల్ సంకృత్యాన్
Khalifa Glimpse | పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్‌డే స్పెషల్.. ‘ఖలీఫా’ గ్లింప్స్ విడుదల
Nagarjuna | నాగార్జున 100వ సినిమాపై క్రేజీ అప్డేట్.. టబు స్థానంలో లేడి సూపర్ స్టార్?