Nagarjuna | తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కింగ్ నాగార్జున కెరీర్లో మరో మైలు రాయి చేరుకోబోతున్నారు. త్వరలో నాగ్ 100వ సినిమా ప్రారంభం కానుండగా, ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ ఖరారు అయ్యిందని తెలుస్తోంది. టైటిల్‌తో పాటు కథా కాన్సెప్ట్, నాగార్జున పాత్ర ఫ్యాన్స్‌లో పలు చర్చలకు దారి తీసింది. అయితే ఆ మధ్య నాగార్జున సరసన టబు నటించనుందని వార్తలు వచ్చాయి. ఈ జోడీ గతంలో ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం, టబు ఆరోగ్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి దూరమవుతున్నారనే టాక్ వినిపిస్తుంది.
అధికారిక ప్రకటన ఇప్పటికీ వెలువడని కారణంగా, సోషల్ మీడియాలో ఈ వార్త ఎక్కువ చర్చకు కారణమైంది. చిత్ర బృందం టబు స్థానంలో నయనతారను తీసుకోవాలని నిర్ణయించిందని సమాచారం. ప్రస్తుతం నయనతార చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున 100వ సినిమాలో నయనతార నటించడానికి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజంగా ఆమె ఈ చిత్రంలో నటిస్తే.. నాగార్జునకి జోడీగా ఆమె ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుందని అంటున్నారు.
కోలీవుడ్ డైరెక్టర్ ఆర్. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నారని సమాచారం. అక్కినేని కుటుంబంలోని ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతున్నారని తెలిసినప్పటి నుండే అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. చిత్రం యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా కలయికగా రూపొందనున్నదని, నాగార్జున ఈ సినిమాలో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా కనిపించనుందని సమాచారం . అభిమానులు నాగార్జున 100వ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ, టబు తప్పుకుందన్న వార్తతో కొంత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వీటి గురించి అధికారిక ప్రకటన త్వరలో రావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.