కోట్‌పల్లి, జనవరి 19 : కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని గురువారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి చూపుతో ఇబ్బంది పడవద్దని కేసీఆర్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఉచిత అద్దాలను అందించడంతోపాటు సమస్య తీవ్రంగా ఉంటే మెరుగైన చికిత్సలకు పంపించి వైద్యం చేసే ఏర్పాట్లను ప్రభుత్వం చేయడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఒక్కో గ్రామంలో నాలుగైదు రోజులపాటు నిర్వహిస్తారన్నారు. కోట్‌పల్లి మండల అభివృద్ధికి రూ.8కోట్లు మంజూరు చేశామన్నారు. దీంట్లో భాగంగా కొత్త మండల ఏర్పాటులో భాగంగా నూతన మండల కార్యాలయాన్ని దాదాపు కోటి రూపాయలతో నిర్మించినట్లు చెప్పారు. అనంతరం మోత్కుపల్లి ఆలయ నిర్మాణ పనుల్లో పాల్గొని పూజ చేశారు. జిన్నారం గ్రామంలో నిర్వహించిన గ్రామ దేవత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచులు, నాయకులున్నారు.