మొయినాబాద్, అక్టోబర్ 14 : మొయినాబాద్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన రమాదేవి అనే మహిళ మంగళవారం ఉదయం ఏటీఎం మిషన్ ద్వారా అకౌంట్లోకి రూ.40 వేలు జమ చేసింది. అయితే, ఖాతాలోకి డబ్బులు జమ అయినట్లు రెండు, మూడు గంటల వరకూ మెసేజ్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె మళ్లీ ఏటీఎం సెంటర్కు వెళ్లింది.
అక్కడ మినీ స్టేట్మెంట్ తీసుకునే సమయంలో అక్కడే ఉన్న నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు హడావుడి చేశారు. మేడమ్.. మాకు ఆల స్యం అవుతుంది. ఏటీఎం నుంచి మీ కార్డును తీయండి అంటూనే.. ఆ కార్డును తీసి వారి కార్డును మిషన్లో పెట్టారు. మినీ స్టేట్మెంట్ను చూసిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఏటీఎం సెంటర్ నుంచి వెళ్లిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే అకౌంట్ నుంచి డబ్బు డ్రా అయినట్లు ఫోన్ను మెసేజ్ రావడంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నది.
వెంటనే బ్యాంకుకెళ్లి ఆరా తీయగా ఏటీఎం నుంచి రూ.40,000 డ్రా అయినట్లు అక్కడి సిబ్బంది చెప్పడంతో .. ఆ ఖాతాను సీజ్ చేయించింది. ఏటీఎం కార్డును చూడగా తనది కాదని గుర్తించింది. ఏటీఎం సెంటర్లో హడావుడి చేసిన వ్యక్తులే కార్డును మార్చారని భావించి.. వెంటనే స్థానిక ఠాణాకెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఏటీఎం సెంటర్కు వచ్చి సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆమె ఏటీఎం మిషన్ నుంచి మినీ స్టేట్మెంట్ తీసే సమయంలో నలుగురు వ్యక్తులు కార్డును మార్చినట్లుగా గుర్తించారు.