షాబాద్, మార్చి 13 : గుర్తుతెలియని వ్యక్తులు వైన్ షాపులో చోరీకి పాల్పడి, అడ్డువచ్చిన యువకుడిని హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి కథనం ప్రకారం.. షాబాద్‌లోని దుర్గా వైన్స్ షాపు పక్కన ఉన్న కూల్ పాయింట్లో షాబాద్ గ్రామానికి చెందిన చేగూరి భిక్షపతి అలియాస్ ప్రవీణ్(35) పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి పని ముగించుకుని ఎప్పటిలాగానే వైన్ షాపు పక్కన పర్మిట్ రూమ్‌లో పడుకున్నాడు. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు వైన్ షాపులో దొంగతనానికి పాల్పడ్డాడు. వైన్ షాపు వెనకాల గోడను పగులగొట్టి రంధ్రం చేసి షాపులోకి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.40వేల నగదుతో పాటు మద్యం బాటిళ్లు, సీసీ కెమెరా డివైజ్‌ను ఎత్తుకెళ్తుండగా భిక్షపతి గమనించి అడ్డుపడ్డాడు. దీంతో దుండగులు అతడి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
సంఘటనా స్థలాన్ని గురువారం ఉదయం చేవెళ్ల ఏసీపీ కిషన్, క్రైమ్ ఏపీసీ శశాంక్‌రెడ్డి, సీసీఎస్, ఎస్వోటీ ఇన్స్పెక్టర్లు ప్రశాంత్, రమణారెడ్డి డాగ్‌స్కాడ్, క్లూస్‌టీమ్ బృందం దుండగుల అనవాళ్ల కోసం వివరాలు సేకరించారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. వారం రోజుల క్రితమే నాగరగూడ వైన్స్‌లో దొంగతనం జరిగిన ఘటన మరువకముందే షాబాద్ వైన్స్‌లో చోరీ జరిగింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.