Yenkepally | మొయినాబాద్, జూలై 05 : భూమిలో బండరాళ్లు.. రప్పలు.. చెట్ల పొదలను తీసివేసి భూమిని తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నాం. అలాంటి భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుంది. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేస్తే మా బతుకులను రోడ్డున పడేసిందని సీఎంకు మహిళలు శాపనార్ధాలు పెట్టారు. పోలీసుల భారీ మోహరింపులో హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. దీంతో భూ బాధితుల్లో మరింత ఆందోళన నెలకొనడంతో భూమి వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని ఎన్కేపల్లి రెవెన్యూలో గల సర్వే నంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాలకు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇంత వరకు సాగులో ఉన్న రైతులకు ప్లాట్లను పరిహారంగా ఇచ్చి భూములను తీసుకుందామని ప్రభుత్వం భావించింది. పలు సార్లు రెవెన్యూ అధికారులు రైతులతో చర్చలు జరిపి ఎకరానికి 200 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. అధికారులు చర్చలు జరిపినప్పుడు చెప్పిన దానికి రైతులు సంతృప్తి చెందకుండ చర్చల్లో నుంచి వెళ్లిపోయారు. అధికారులు చివరగా ఎకరానికి 300ల గజాల స్థలం ఇవ్వడానికి సిద్దంగా ఉంది. కాని ఎకరానికి 500 గజాల స్థలం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దానికి అధికారులు అంగీకరించలేదు. ప్రభుత్వం చెప్పిన ఆదేశానుసారం మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉందని అధికారులు తేల్చి చెప్పారు. రైతులు ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వం ఎలాగైనా భూములను తీసుకోవాలని సంకల్పించింది.
పోలీసుల పహారాలో భూముల సర్వే
భూములను తీసుకోవడం జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వం అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో అందులో భాగంగా శనివారం చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, హెచ్ఎండీఏ అధికారులు భారీ పోలీసుల మధ్య భూమిని సర్వే చేయించారు. భూమికి రెండు వైపుల నుంచి ఉన్న దారికి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భూమికి రెండు వైపుల భారీగా పోలీసులను మోహరించారు. సుమారుగా ఐదారు వాహనాల్లో 200 మంది పోలీసు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు. భూమి సర్వే చేసినంత సేపు రైతులను ఒక్కరిని కూడ లోపలికి రానివ్వకుండ అడ్డుకున్నారు. భూమి చుట్టు సర్వే చేయడంతో పాటు భూమికి ఒక వైపు ఉన్న రోడ్డును సైతం సర్వే చేశారు.రోడ్డును 30 పీట్ల వెడల్పు చేస్తూ సర్వే చేసి రోడ్డు హద్దు బందులు ఏర్పాటు చేశారు. పోలీసుల పహారాలో సుమారుగా ఒక గంట పాటు భూమిని సర్వే చేశారు. భూమి వద్ద పోలీసుల బలగాలు మోహరించడంతో పాటు గ్రామంలో సైతం అక్కడక్కడ పోలీసులను మఫ్టీలో ఏర్పాటు చేశారు. భూమి సర్వే చేయడానికి అధికారులు వచ్చారని తెలుసుకున్న రైతులను కనీసం భూమి వద్దకు వెళ్లనివ్వకుండ బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహిళలు శాపనార్దాలు పెట్టారు. ఎన్కేపల్లి గ్రామం పోలీసుల కాపలా వలయంలో బంది అయ్యింది. ఒక్క సారిగా పోలీసుల వాహనాలు ఐదారు రావడంతో భూ బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరానికి 5 వందల గజాల స్థలం ఇవ్వాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
మూడు వందల గజాలకు ఒప్పుకుంటే రేపు ప్లాట్లు : చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ
మూడు వందల గజాల స్థలంకు ఒప్పుకుంటే ఒక్క రోజులో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని ఆర్డీవో చంద్రకళ అన్నారు. ప్రభుత్వం ఈ భూమిని తీసుకోవడం ఖాయమని, 300 గజాలకు ఒప్పుకుంటే రేపే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పారు. ఎకరానికి 200 గజాల నుంచి 250 గజాల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వ అనుమతితో కలెక్టర్ సిద్దంగా ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే యాదయ్య చెప్పడంతో 3 వందల గజాల స్థలం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండ హెచ్ఎండీఏ లే అవుట్ చేసి , విశాలమైన రోడ్లు వేసి ప్లాట్లు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాము. హెచ్ఎండీఏ లే అవుట్ అంటే చాలా విలువతో కూడిన ప్లాటు అని మీరు ఒప్పుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని ఆమె చెప్పారు. ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందాలి అనుకుంటే ప్రభుత్వంకు వినతి ఇవ్వవచ్చని ప్రభుత్వం ఎంత ఇవ్వాలని ఆదేశిస్తే అంత రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని రైతులకు చెప్పారు.