మొయినాబాద్, జూలై 11 : పొలాలను కాపాడుకునేందుకు ఎన్కేపల్లి భూబాధితులు రిలే దీక్షలు చేపట్టారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ.. తమ భూములను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి, ఎన్కేపల్లిలోని సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాల భూమిని ప్రభుత్వం గోశాల నిర్మాణానికి ప్రతిపాదించగా.. ఆ భూములను గత 70 ఏండ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్న 50 కుటుంబాల వారు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం పోలీసులతో ఆ పొలాలను స్వాధీనం చేసుకుని కంచె ఏర్పాటు చేయిస్తుందన్న భయంతో అక్కడే గత ఐదు రోజులుగా రాత్రీపగలు ఉంటూ వంటావార్పు చేస్తూ వనభోజనాలు చేస్తున్నారు. అందులో భాగంగానే భూబాధితులు శుక్రవారం నుంచి రిలే దీక్షలను ప్రారంభించా రు. తమ భూముల్లో గోశాల నిర్మాణం వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు న్నారు. తమ జీవనాధారాన్ని వదులుకోమని స్పష్టం చేస్తున్నారు.