వికారాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తైనా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మూడు నెలలు దాటినా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవ డంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడంలేదు. బోనస్ బోగస్సేనా అని మండిపడుతున్నారు. అయితే సన్నరకం వడ్లకు ప్రైవేట్ మా ర్కెట్లో అధిక ధర ఉన్నా బోనస్ కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ ఇబ్బంది పెడుతున్నదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో యాసంగిలో 8,921 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. అందుకుగానూ రూ. 4.46 కోట్ల బోనస్ బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉన్నది.
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వడంలోనూ రైస్ మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చి న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. మిల్లర్లపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సర్కార్కే టోకరా పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యం రూపంలో పౌరసరఫరాల శాఖ విధించిన నిర్ణీత గడువులోగా ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ, ఒకరిద్దరు మిల్లర్లు మినహా మిగిలిన వారు పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఎలాంటి అనుమానం రాకుండా.. విడతల వారీగా పౌరసరఫరాల శాఖకు నాసిరకం బియ్యాన్ని అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. జిల్లాలో మిల్లర్ల నుంచి గతేడాది వానకాలానికి రావాల్సిన సీఎంఆర్ 60 శాతం పూర్తికాగా, మరో 40 శాతం రావాల్సి ఉండగా.. యాసంగికి సంబంధించి 30 శాతం మాత్రమే సీఎంఆర్ బియ్యంరాగా, మరో 70 శాతం మిల్లర్ల నుంచి రావాల్సి ఉన్నది. పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 85,678 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్‌ను తిరిగివ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 15 వేల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే మిల్లర్లు అందజేశారు.