కరీంనగర్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలాచోట్ల వరి నాట్లు పూర్తి చేశారు. కొందరు రైతులు జనవరిలో నాట్లేశారు. యాసంగి ప్రారంభంలోనే మొగి పురుగు ఉధృతిని గుర్తించిన వ్యవసాయ అధికారులు, కేవీకే, ఏరువాక, పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. మొగి పురుగు నివారణకు సూచనలు చేస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సారి మొగిపురుగు ప్రభావంతోపాటు జింక్ లోపం, సల్ఫైడ్ ప్రభావం కూడా కనిపిస్తున్నట్టు పొలాస శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఆలస్యంగా లేదా నారు ముదిరిన తర్వాత నాట్లు వేయడం, సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడం, సూర్యరశ్మి రోజుకు 7 గంటల కంటే తక్కువగా ఉండడం, నత్రజని తక్కువగా వాడడం, కాండం బలహీనం కావడం వంటి కారణాలతో మొగి పురుగు వ్యాప్తిస్తున్నది. నారుమడిలో ఆశిస్తే మొక్కల పిలకలు ఎండి చనిపోతాయి. ప్రారంభం నుంచి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకు వస్తాయి. నాట్లు వేసిన పది పన్నెండు రోజుల్లో ఆశిస్తే.. పొలాలు మాడి పోతాయి.
పురుగు లార్వా దశలో ఉన్నపుడే కాండం తొలుస్తూ పంటకు ఎక్కువ నష్టం చేస్తుంది. రెక్కలు వచ్చిన తర్వాత తన సంతానాన్ని ఉధృతం చేసేందుకు చుట్టు పక్కల వరి పంటను ఆశిస్తుంది. దీనికి తోడు జింక్ లోపం, సల్పైడ్ దుష్ప్రభావంతోనూ వరికి నష్టం వాటిల్లుతున్నది. రైతులు పంట మార్పిడి పాటించక పోవడం, ప్రతి సీజన్లో వరినే సాగు చేయడం వల్ల ఈ లోపాలు ఏర్పడుతున్నట్లు వ్యవసాయ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
ప్రస్తుతం చాలాచోట్ల వరి పొలాలు పిలక దశలో ఉన్నాయి. ఈ సమయంలో మొగి పురుగు ఉధృతిని నివారించేందుకు ప్రతి ఎకరాకూ 3 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అందులో వారానికి బుట్టకు 25-30 పురుగులు పడినప్పుడు తప్పని సరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ దశలో ఎకరాకు కార్బోప్యూరాన్ 3జీ గుళికలు 10 కిలోలు లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు, లేదంటే క్లోరాన్ట్రోనిలిప్రోలు 4జీ గుళికలు 4 కిలోలు 20 నుంచి 25 కిలోల ఇసుకలో కలిపి బురద పదనులో వేసుకోవాలి.
మొగి పురుగు నివారణకు సిఫారసు చేయబడని ఏ ఇతర 10జీ లేదా సేంద్రియ గుళికలు (గంట గోళీలు) యూరియాతో కలిపి వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని రైతులు గమనించాలి. ఒక వేళ వరి పంట చిరుపొట్ట దశలో రెక్కల పురుగు ఉధృతిని గమనిస్తే కార్టాప్ హైడ్రోక్లోరైడ్, 50 శాతం ఎస్పీ 2 గ్రాములు, (ఎకరాకు 400 మిల్లీ లీటర్లు ) లేదంటే క్లోరాన్ట్రోనిలిప్రోలు 0.3 మిల్లీ గ్రాములు (ఎకరాకు 60 మిల్లీ లీటర్లు) లేదంటే ఐసోసైక్లోసిరం 0.6 మిల్లీ లీటర్లు (ఎకరాకు 120 మిల్లీ లీటర్లు) ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
జింకు ధాతులోపంతో పొలాలు పాలిపోతున్నట్టు గుర్తించిన అధికారులు, నివారణ చర్యలను వివరిస్తున్నారు. ప్రతి యాసంగి సీజన్లో రైతులు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా 10 కిలోల జింక్ సల్ఫేట్ను 200-250 కిలోల మాగిన పశువుల పేడ లేదంటే వర్మీ కంపోస్టు కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గిన తర్వాత చివరి దుక్కిలో వేయాలని చెబుతున్నారు. పైరుపై జింక్ లోపం కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ను కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలని, జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగులు, తెగుళ్ల నివారణ మందులు కలుపవద్దని, చౌడు నేలల్లో పిచికారీ తప్పని సరిగా చేసుకోవాలని సూచిస్తున్నారు.
సల్ఫైడ్ దుష్ప్రభావంతో వరి నేలల్లో, పంట మధ్య కాలంలో అక్కడక్కడ బాగా పెరిగిన పంట మొత్తం పసుపు వర్ణంలోకి మారిపోవడం, మడి బాగా మెత్తగా ఉండి కాలు చాలా లోతుగా దిగబడి పోతుంది. పొలంలో నడుస్తుంటే బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్గంధం వాసన, మొక్కను వేర్లతో బయటకు తీసినప్పుడు కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. పంట వేర్లు పూర్తిగా నల్లబడి జీవం లేక కుళ్లిన వాసన వస్తుంది.
మొక్కలు పూర్తిగా చనిపోయే ప్రమాదముంటుంది. అధిక నీటి ముంపు ఉండడం, తగిన రీతిలో పంట వేర్లకు గాలి అందక పోవడం, నేలలో రసాయన చర్యల వల్ల లభ్య ఇనుము మార్పు చెందక పోవడం, చాలా కాలంగా బరువు నేలల్లో సల్ఫర్ (గంధకం) కలిగిన 20-20-0-15, 20-20-0-13 లాంటి కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వాడడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మొక్క వేర్లకు తగిన గాలి తగిలేలా, మురుగు నీటిని తీసి మళ్లీ నీరు అందివ్వాలి. పైరు వేయడానికి మడిని తయారు చేసే ముందు మట్టిన బాగా కలియబెట్టి ఆరబెట్టాలి. భూమిని ఎత్తు చేసి ఒకటీరెండు బండ్ల ఎర్రమట్టిని వేయాలి. పంట మధ్య కాలంలో పొలాన్ని సన్న నెర్రెలు వచ్చే వరకు ఆరగట్టి అప్పుడప్పుడు మళ్లీ నీరివ్వాలి. ఈ చర్యలతో క్రమంగా సల్ఫైడ్ దుష్ప్రభావం తగ్గుతుంది. అమ్మోనియం, సల్ఫేట్ వంటి ఎరువులను ఇలాంటి పొలాల్లో వాడకూడదు.