యాచారం, జూన్ 4 : సారు మాకు రుణమాఫీ ఎప్పుడైతది, ఇప్పటివరకు మాకు రుణమాఫీ కాలేదని రైతులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ప్రశ్నించారు. నెలలు గడుస్తున్నా మాకు రుణమాఫీ ఎందుకు అవుతలేదని వారు ఎమ్మెల్యేను నిలదీశారు. యాచారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు క్వాలిటీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగించిన అనంతరం రైతులు మాకు రుణమాఫీ కావడంలేదని అధికారుల ముందు ఎమ్మెల్యేను నిలదీశారు. ఇప్పటికే చాలామందికి రుణమాఫీ అయిందని కొన్ని కారణాలవల్ల కొంతమందికి కాలేదని ఎమ్మెల్యే రైతులకు సర్ది చెప్పారు. వెంటనే వ్యవసాయ అధికారిణి బదులిస్తూ సమస్య యాచారం మండలంలోని లేదని రాష్ట్రవ్యాప్తంగా ఉందని దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె సమాధానం ఇచ్చారు. రుణమాఫీ అంశంపై చౌదర్పల్లి మాజీ సర్పంచ్ గౌర నరసింహ ప్రజాప్రతినిధులను అధికారులను ప్రశ్నిస్తుండగా కొంతమంది కాంగ్రెస్ నేతలు కల్పించుకొని అతనిపై చిందేశారు. దీంతో ఇదెక్కడి అన్యాయమని, బాధలు పంచుకునే హక్కు కూడా లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. రైతుల సమస్యలను పరిష్కరించాలనీ ఆయన డిమాండ్ చేశారు. రైతులందరికీ రుణమాఫి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన మూల్యం తప్పదన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు మహిళల వేడుకోలు..
సారూ.. మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. నీకు దండం పెడతా మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించుండ్రి అంటూ మహిళలు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని వేడుకున్నారు. మొదటి లిస్టులో పేరు వచ్చిందని, తరువాత ఇల్లు రాలేదని మొర పెట్టుకున్నారు. దీంతో స్పందించిన ఆయన సంబందిత అధికారులను పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులందరికీ దశలవారీగా ఇండ్లు అందజేస్తామని తెలిపారు.