కొడంగల్, ఏప్రిల్ 24 : విద్యా వ్యవస్థను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధుల కేటాయింపుతో చర్యలు చేపడుతున్నామని చెబుతున్నదే తప్పా.. పనుల నిర్వహణలో ఏ మాత్రం శ్రద్ధ వహించడంలేదని విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ పట్టణ పరిధిలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీ గురుకులాల నిర్మాణాలకు గతంలోనే మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ ప్రాంతంలో స్థల సేకరణ చేపట్టారు.
కాగా.. ఆ ప్రాంతంలో ఎస్టీ గురుకుల పాఠశాల భవన నిర్మాణం పూర్తయి పాఠశాల కొనసాగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రాంతంలో యూనివర్సిటీ తరహాలోని డిజైన్‌తో గురుకులాల భవన నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేసింది. మంజూరుతోపాటు గురుకులాల నిర్మాణానికి 11 అక్టోబర్ 2024న అట్టహాసంగా ప్రజాప్రతినిధులతోపాటు అధికారుల నడుమ పనుల ప్రారంభానికి భూమి పూజ చేపట్టారు. భూమి పూజ చేపట్టి దాదాపు 6 నెలలకు పైగా కావస్తున్నా నేటి వరకు ఆ ప్రాంతంలో ఎటువంటి పనులు జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పనుల ప్రారంభ సమయంలో 2025-26 విద్యా సంవత్సరానికి భవన నిర్మాణం పూర్తయితే గురుకులాల ప్రారంభం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. గురుకులాలకు సౌకర్యవంతంగా ఉండేలా నలువైపులా బీటీ రోడ్ల నిర్మాణం, ఆ ప్రాంతంలోని కొడంగల్ పెద్ద చెరువును ట్యాంక్ బాండ్లా తీర్చిదిద్దే ప్రణాళిక కూడా చేపట్టారు. ఇందుకు రూ.45 కోట్ల నిధులను కూడా కేటాయించగా.. టెండర్ పనులు పూర్తయ్యాయి. కాగా.. గురుకుల భవన నిర్మాణానికి మొదటగా పూర్తయిన టెండర్ అనుకూలంగా లేకపోవడంతో రెండో టెండర్ ప్రక్రియ కొనసాగనున్నట్లు సమాచారం.
విద్యా వ్యవస్థ హబ్‌గా పాత కొడంగల్ ప్రాంతం
పాత కొడంగల్ ప్రాంతాన్ని విద్యా హబ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. ఇదివరకు నిర్మాణంలో ఉన్న ఎస్టీ గురుకులంతోపాటు ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకే చోట నిర్మించి ఓ యూనివర్సిటీ మాదిరిగా ఏర్పాటు చేసి దాదాపు 2వేల మంది విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టింది. విశాలమైన పాఠశాల గదులు, ఆటస్థలం, పార్క్, గ్రంథాలయం, ల్యాబ్ వంటి అన్నింటా సౌకర్యాలతో భవన నిర్మాణం చేపట్టే ప్రణాళిక సిద్ధం చేశారు. 11 అక్టోబర్ 2024 పనులను అట్టహాసంగా ప్రారంభించి, అదే సంవత్సరం 2024 నవంబర్ 4న భవన నిర్మాణాలకు సంబంధించి ఆ ప్రాంతంలో మట్టి నమూనాలను సేకరించారు. మట్టి నమూనాలు సేకరించి కూడా 6 నెలల కావస్తున్నా నేటి వరకు ఆ ప్రాంతంలో ఎటువంటి పనులూ జరగడం లేదు.
ప్రస్తుతం ఎస్సీ గురుకులం చేవెళ్ల ప్రాంతంలో, బీసీ గురుకులం ఈ విద్యా సంవత్సరం కొడంగల్ మండలంలోని ఉడిమేశ్వరం గ్రామ శివారులో, మైనారిటీ గురుకులం ప్రస్తుతం బొంరాస్‌పేట మండలంలోని చిల్ముల్ మైల్వార్ ప్రాంతంలోని ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందుల నడుమ చదువులు కొనసాగిస్తున్నారు. ఎప్పుడు గురుకుల భవనాల పనులు కొనసాగుతాయి, ఎప్పుడు అనుకూల ప్రాంతంలో చదువుకుంటామోనని విద్యార్థులు ఆశాభావంలో ఉన్నట్లు తెలుపుతున్నారు. కనీసం ఈ విద్యా సంవత్సరంలోనైనా పనులు చేపడితే వచ్చే విద్యా సంవత్సరంలోనైనా స్థానికంగా చదువుకునే అవకాశం ఉంటుందని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది
రాష్ట్రవ్యాప్తంగా ఒకే డిజైన్ ఉండేలా ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణాలు చేపట్టేందుకు డిజైన్ సిఫార్సుల పనులు కొనసాగడంలో ఆలస్యం జరుగుతున్నది. ఇంటిగ్రేటెడ్ గురుకుల భవన నిర్మాణాలకు రెండో విడత టెండర్ ప్రక్రియ కొనసాగుతుంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభమవుతాయి. మరో నెల రోజుల్లో పనులు ప్రారంభయ్యే అవకాశం ఉన్నది. పనుల ప్రారంభంతో సంవత్సరంలో భవన నిర్మాణం పూర్తవుతుంది.
– శ్రీనివాస్, ఈడబ్ల్యూడీఎస్ ఏఈ, కొడంగల్