షాబాద్, ఏప్రిల్ 11 : గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారడంతో నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్లపై కాలినడకన వెళ్లే ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. తమ గ్రామాల్లోని రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ రోడ్లను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఆయా గ్రామాల నుంచి మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లాలంటే అవస్థలు తప్పడం లేదని వాపోతున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ అధ్వానంగా మారి, గుంతలమయం కావడం తో పెద్ద వాహనాలతోపాటు ద్విచక్ర వాహనదారులూ ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గత బీఆర్ఎస్ హయాంలో మారుమూల గ్రామాలకూ బీటీ రోడ్లు వేయిం చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నది. కాగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులూ చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా అధ్వానంగా మారాయి. షాబాద్ మండలంలోని బోడంపహాడ్, మన్మర్రి, ముద్దెంగూడ, కుమ్మరిగూడ, నాగరకుంట, ఎర్రొనిగూడ, రేగడిదోస్వాడ, నాందార్ఖాన్పేట, శంకర్పల్లి మండలంలోని అంతప్పగూడ, సంకెపల్లి, చేవె ళ్ల మండలంలోని మడికట్టు, ఆలూర్, మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్ తదిత ర గ్రామాలకు వెళ్లే దారులు పూర్తిగా గుంతలమయంగా మారి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. బోడంపహాడ్ వెళ్లే దారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది గాయాలపాలైన ఘటనలున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.
తమ గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. 20 రోజుల కిందట రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. రోడ్డును బాగు చేయాలని అధికారులు, పాలకులకు పలుమార్లు చెప్పినా ఫలితం లేదు.
-కారు చెన్నయ్య, బోడంపహాడ్, షాబాద్
గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైంది. హైవే నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే మా గ్రామం ఉంటుంది. ఎన్నికలప్పుడే పాలకులకు ప్రజలు గుర్తుకొస్తారు.. తర్వాత మరిపోతారు. రోడ్డు గుంతలమయంగా మారడంతో ద్విచక్రవాహనంపై వెళ్లాలన్నా అవస్థలు తప్పడంలేదు. -బండ నర్సింహారెడ్డి, మన్మర్రి, షాబాద్