తాండూరు, ఆగస్టు 5 : వికారాబాద్ జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. తాండూరు నియోజకవర్గంలో సోమవారం రూ. 250 కోట్ల అభివృద్ధి పనులకు శాసనసభాపతి ప్రసాద్‌కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
తాండూరు మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 నీటి పథకం నుంచి నీటి సరఫరా అభివృద్ధికి రూ.27.50 కోట్లు, గొల్ల చెరువు సుందరీకరణ మురుగు నీటి తొలగింపు కాల్వ నిర్మాణానికి రూ.4.88 కోట్లు, సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్‌కు రూ.1.60 కోట్లు, తాండూరు-వికారాబాద్ రోడ్డు నిర్మాణానికి రూ.48.80 కోట్లు, తాండూరు-మహబూబ్‌నగర్ రోడ్డు నిర్మాణానికి రూ.35 కోట్లు, చంద్రవంచ సబ్‌స్టేషన్‌కు రూ.2.34 కోట్లు, కందనెల్లి సబ్‌స్టేషన్‌కు రూ.2.43 కోట్లు, జుంటుపల్లి సబ్‌స్టేషన్‌కు రూ.2.99 కోట్ల పనులకు శంకుస్థాపనలతో పాటు రూ.2.48 కోట్లతో ఏర్పాటు చేసిన జినుగుర్తి సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. రూ.30 కోట్లతో బషీరాబాద్-కరన్‌కోట్ రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గంతో పాటు తాండూరు అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నారు. అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. వెనుకబడిన తాండూరు అభివృద్ధి కోసం సీఎంతో మాట్లాడి ప్రత్యేక నిధులు ఇప్పిస్తానన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ప్రక్షాళన చేపట్టామన్నారు. ప్రస్తుత చట్టాన్ని సవరణ చేస్తూ త్వరలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికీ విడుతల వారీగా 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తున్నామని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రహదారులతో పాటు ప్రతి పల్లెకూ రోడ్లు వేస్తామన్నారు. కరెంటు ఇబ్బందులు లేకుండా తాండూరులో అవసరమున్నంతవరకు సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇందుకు నిధులు విడుదల చేస్తామన్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం, మంత్రులతో మాట్లాడి తాండూరుకు ప్రత్యేక నిధులు తీసుకొస్తామని, కందిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా తాండూరును ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, కలెక్టర్ ప్రతీక్‌జైన్, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్‌నాయక్, ఎస్ఈ వసంతనాయక్, ఇన్చార్జి ఈఈ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మార్కెట్ కమిటీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం..
తాండూరు, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన కార్యవర్గ సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, వైస్ చైర్మన్ చందర్నాయక్తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.