జిల్లాలోని మహిళా పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ఇర్షాద్ ఫిర్యాదుతో వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ, ఎస్ఐల అవినీతి బాగోతం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. జిల్లా మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐలను అవినీతి ఆరోపణలపై విచారణ చేయడంతో రక్షక భటులు కాదు.. భక్షక భటులుగా మారారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళలకు సత్వర న్యాయం జరిగేందుకు మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే.. కొందరు అవినీతి పోలీస్ అధికారులు మహిళలకు న్యాయం చేయడం దేవుడెరుగు.. వారిని అడ్డం పెట్టుకొని వసూళ్లకు పాల్పడుతూ పోలీస్ శాఖకు మాయని మచ్చ తెస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
– వికారాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ)
ఎక్కువగా భార్యాభర్తల తగాదాలు వచ్చే మహిళా పీఎస్‌లలో ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి భార్యభర్తలను కలపాల్సిన సంబంధిత పోలీస్ అధికారులు వారి నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలనేదానిపై దృష్టి పెట్టారనే ఆరోపణలున్నాయి. కౌన్సిలింగ్ పేరిట సెటిల్మెంట్ వ్యవహారాన్ని నడిపిస్తున్న సంబంధిత పోలీస్ అధికారులు.. సెటిల్మెంట్ చేసుకుంటారా లేదంటే కేసు నమోదు చేయమంటారా అంటూ బెదిరింపులకు పాల్పడుతూ బాధితుల నుంచి దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మహిళా పోలీస్ స్టేషన్లకు వచ్చే వారికి తగు న్యాయం జరుగుతుందనే అపోహతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు మహిళా పీఎస్‌ను పట్టించుకోకపోవడంతో సంబంధిత పోలీస్‌స్టేషన్‌ను సెటిల్మెంట్లకు, వసూళ్లకు అడ్డాగా మార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సొంత డిపార్ట్మెంట్కు చెందినవారిని కూడా వసూళ్లలో వదలిపెట్టలేదనే సంబంధిత సీఐపై విమర్శలున్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్‌ను ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయడం, ఇవ్వకపోవడంతో ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వకుండానే అతడిపై కేసు నమోదు చేసి కలిసుందామనుకున్న భార్యాభర్తలను దూరం చేసినట్లు మహిళా పీఎస్ సీఐ సరోజ, సంబంధిత పీఎస్ సిబ్బందిపై ఆరోపణలున్నాయి. సొంత డిపార్ట్మెంట్కు చెందినవారితోనే ఈ విధంగా ఉంటే సామాన్యులతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దానిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళా పీఎస్ సీఐ, ఎస్ఐ, సిబ్బంది వసూళ్ల వ్యవహారంపై సీరియస్‌గా ఉన్న ఎస్పీ వారిపై వేటు వేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐతోపాటు పలువురు సిబ్బందిపై గత కొంతకాలంగా తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మహిళా పీఎస్‌లో ఫిర్యాదు చేస్తే, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి కలపాల్సిన పోలీసులు డబ్బులకు కక్కుర్తిపడి సెటిల్మెంట్ చేసి విడగొడుతున్నట్లు సదరు సీఐతోపాటు సిబ్బందిపై ఆరోపణలున్నాయి. భార్యాభర్తల తగాదాలో ఫిర్యాదు చేస్తే పలు కేసుల్లో వాస్తవం తెలుసుకోకుండానే భర్తతోపాటు వారి కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి, సెటిల్మెంట్ చేసుకుంటారా లేదంటే కేసు నమోదు చేయాలా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సీఐపై ప్రచారం జరుగుతున్నది. కౌన్సిలింగ్ పేరిట పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మీ కేసులు ఎత్తివేయాలంటే డబ్బులిచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని సలహాలిస్తున్నట్లు తెలిసింది.
బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యతను సంబంధిత మహిళా పీఎస్‌లో పనిచేసే హోంగార్డుకు అప్పగించినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఏసీబీ దాడుల సమయంలో సదరు హోంగార్డు పరారైనట్లు సమాచారం. మరోవైపు సదరు పోలీసు అధికారుల వసూళ్ల బాగోతం బయటకు రాకుండా పోలీస్ స్టేషన్లలో ఫోన్లను అనుమతించకుండా సీఐ హుకూం జారీ చేయడంతో ఎవరు వెళ్లినా రిసెప్షన్లో ఫోన్ పెట్టి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. ఇటీవల పీఎస్‌లోకి ఫోన్ తీసుకెళ్లిన కొందరు రిపోర్టర్లపై దురుసుగా ప్రవర్తించిన సదరు సీఐ, కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది.
తాండూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇర్షాద్‌ను ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేయడంతో మహిళా పీఎస్ సీఐ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. తన కుటుంబ సమస్యను కొందరు తప్పుదారి పట్టించి తనపై, తన కుటుంబ సభ్యులపై 498ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయించడంతో స్టేషన్ బెయిల్ కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలను డిమాండ్ చేయడంతో రూ.40 వేలు ఇచ్చేందుకు ఒప్పుకొని ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రూ.20 వేలు ఇచ్చినట్లు, మరో రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఈ నెల 21న మహిళా పీఎస్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేసి.. సీఐ, ఎస్ఐని విచారణ జరిపారు. విచారణ అనంతరం డబ్బులు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకోకుండా, సదరు పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఈ నెల 25న ఏసీబీ కార్యాలయంలో వివరణ ఇవ్వాలని సీఐ, ఎస్ఐలకు ఏసీబీ అధికారులు నోటీసులిచ్చారు.
తన భార్య ఫిర్యాదుతో ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వకుండానే 498ఏ కింద తనపై కేసు నమోదు చేశారని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాజు తెలిపారు. గతేడాదిగా కౌన్సిలింగ్ పేరిట పిలిచి డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకో అని చెప్పడం తప్ప, తన భార్యతోపాటు కూర్చోబెట్టి ఏనాడూ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వలేరని ఆరోపించారు. పిల్లల కోసం కలిసుండాలని అనుకున్న మమ్మల్ని డబ్బుల కోసం విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన తప్పు ఏమీ లేదని, వాస్తవం చెప్పేందుకు ఎంత ప్రయత్నం చేసినా పట్టించుకోలేదని వాపోయారు.