ఆమనగల్లు, నవంబర్ 12: ఆమనగల్లులోని శ్రీ లక్ష్మీ గార్డెన్లో బుధవారం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అధికారులతో పాటు రాజకీయ నాయకులు పెద్దఎత్తున పాల్గొనడంతో ఈ కార్యక్రమం రాజకీయ సమావేశాన్ని తలపించింది.
నాయకులు ఒకరి తర్వాత ఒకరు ప్రసంగాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ప్రశంసించడం చర్చనీయాంశమైంది. కళ్యాణలక్ష్మీ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు తీసుకోవడానికి వచ్చిన మహిళలు అసహనం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉంటూ ఇబ్బందులకు గుర య్యారు. సభ వేదికపై ఉన్న ఎంపీడీవో, తహసీల్దార్, పురపాలక సంఘం కమిషనర్ తదితరులు అధికార పార్టీ నాయకులను ఏమన లేక చూస్తూ ఉండిపోయారు. వేదికపై ఎలాంటి పదవులు, హోదాలు లేని నాయకులు కూర్చోవడంతో హౌసింగ్ ఏఈతో పాటు ఇతర అధికారులు వేదిక కింద కూర్చున్నారు. అధికారిక కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జగన్ అధ్యక్షత వహించడం విడ్డూరంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. తమ కూతుళ్ల వివాహలు చేసిన 23 నెలలకు కళ్యాణలక్ష్మీ చెక్కులు ఇచ్చారని, అది కూడా తులం బంగారంపై అడిగితే స్పందించేవారే కరువయ్యారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.